'నా ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న వదంతులు ఎవరు నమ్మవద్దు. కంగారు పడవద్దు... అధైర్య పడవద్దు. నేను ఆరోగ్యంగానే ఉన్నాను. భగవంతుని ఆశీస్సులతో, మీ అందరి ఆదరాభిమానాలతో నేను పరిపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తాను' తన ఆరోగ్యంపై కార్యకర్తల కోసం మాజీ మంత్రి, రాష్ట్ర భాజపా సీనియర్ నేత పైడికొండల మాణిక్యాలరావు చేసిన చివరి ట్వీట్ ఇది.
కరోనా సోకినప్పటికీ మాణిక్యాలరావు ధైర్యం సడలిపోలేదు. కరోనాతో అందరూ అప్రమత్తంగా ఉండాలని ఇటీవల ఓ వీడియోలో ప్రజలకు జాగ్రత్తలు కూడా చెప్పారు. కానీ అదే ఆయన చివరి వీడియో అయింది. విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు.
పైడికొండల మాణిక్యాలరావుకు ఆయన మిత్రుడి ద్వారా 20 రోజుల కిందట కరోనా సోకింది. పాజిటివ్‌గా నిర్ధరణ అయిన వెంటనే ఆయన కొవిడ్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్వీయ వీడియోను విడుదల చేశారు. అనుమానం వస్తే కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని వీడియో ద్వారా ప్రజలకు సూచించారు. కనీస జాగ్రత్తలు పాటించాలని కోరారు. కొవిడ్‌తో భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. కానీ కరోనాతో పోరాటంలో ఆయన ఓడిపోయారు. ఇది వరకే ఆయనకు హై బీపీ, ఛాతి సమస్యలు ఉన్నాయి. కరోనా సోకటంతో ఆయన ఆరోగ్యం క్షీణించి కన్నుమూశారు.