కొవిడ్ చికిత్స పేరుతో ప్రైవేటు ఆసుపత్రులలో జరుగుతున్న వ్యవహారం క్రమంగా బయటపడుతోంది. పశ్చిమగోదావరి జిల్లాలో రెండు ఆసుపత్రులకు అధికారులు సంజాయిషీ నోటీసులు ఇచ్చారు. ఏలూరు నరసింహారావుపేటలోని మురళీకృష్ణ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కరోనా చికిత్సకు అనుమతి తీసుకోకుండానే కొవిడ్ చికిత్స అందిస్తోందని అధికారులు గుర్తించారు. నిర్వాహకులు రూ.2లక్షల డిపాజిట్‌తో పాటు రోజుకు రూ.40వేల ఫీజు, పరీక్షలు, మందుల ఖర్చు బాధితులపైనే మోపుతున్నారని, రెమిడెసివిర్ ఇంజెక్షన్లను బాధితులతో తెప్పించి.. అందులో పూర్తి డోసులు ఇవ్వడం లేదని అధికారుల విచారణలో ప్రాథమికంగా తేలింది. దీంతో ఆసుపత్రి వివరణ కోరుతూ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నోటీసు జారీచేశారు.
భీమవరం గాయత్రి ఆసుపత్రిలోనూ రోగితో రూ.2 లక్షల వరకు డిపాజిట్ చేయించుకున్నట్లు అధికారులు గుర్తించారు. ‘ఆసుపత్రిలో అగ్నిమాపక చర్యలు లేవు. జీవవ్యర్థాల నిర్వహణ, ఇతర నిబంధనల అమలు లేదు. ఈ ఆసుపత్రిపై చర్యలు తీసుకుంటున్నాం’ అని డీఎంహెచ్‌ఓ డాక్టర్ సునంద తెలిపారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురికి అనుమానిత లక్షణాలు ఉండగా ఓ వైద్యుడు ఇంట్లోనే ఉంచి చికిత్స చేస్తున్నాడు. నాలుగు రోజుల తర్వాత వారిలో ఒకరు చనిపోయారు. దీనిపై విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి: