అర్ధ శతాబ్దానికి ముందు వ్యవసాయ రంగానికి అనుబంధంగా పౌల్ట్రీ పరిశ్రమ ప్రారంభమైంది. వందల కోళ్లతో ప్రారంభమైన ఫారాలు నేడు లక్షల సంఖ్యకు చేరుకున్నాయి. గతంలో ఏడాదిలో 8 నెలలు కోడిగుడ్డుకు గిట్టుబాటు ధర లభించేది. మిగిలిన 4 నెలలు అంతగా రేటు లేకపోయినా రైతులకు వెసులుబాటుగానే ఉండేది. అయితే రెండేళ్లుగా పౌల్ట్రీ రైతులు నష్టాలను ఎదుర్కొంటున్నారు. దాణా ధరలు పెరగడం, గుడ్డుకు సరైన ధర లేకపోవడం, కొవిడ్ కారణంగా ఎగుమతులు తగ్గడం వంటి కారణాలతో పౌల్ట్రీ పరిశ్రమ నష్టాల్లోకి వెళ్లింది. ఆక్వా ఫీడ్ చట్టంలో పౌల్ట్రీ పరిశ్రమలను చేర్చాలని రైతులు కోరుతున్నారు.
అగ్రగామిగా ఉన్న నష్టాలు తప్పడంలేదు
దేశంలో కోడిగుడ్ల ఉత్పత్తిలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని కేంద్ర పశుసంవర్ధక శాఖ తాజాగా వెల్లడించింది. రాష్ట్రంలో ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలో గుడ్లను ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నాయి. దేశంలో ఎగుమతి అయ్యే గుడ్లలో 19.1 శాతం ఆంధ్రప్రదేశ్ నుంచే అవుతున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. అయినప్పటికీ ప్రస్తుతం పౌల్ట్రీ రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిశ్రమ ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.
దాణా ధర తగ్గింది.. కోళ్లూ తగ్గాయి
కోడిగుడ్ల రేటు నిర్ణయించడంలో దాణా ముఖ్య పాత్ర పోషిస్తుంది. గత సంవత్సరం దాణా ముడిసరుకుల ధరలు అధికంగా ఉండి టన్ను రూ. 22 వేలు పలికింది. తాజాగా మొక్కజొన్న ధరలు దిగిరావటంతో టన్ను దాణా ధర రూ. 18,500 గా ఉందని రైతులు చెప్తున్నారు. మరోపక్క కరోనా కారణంగా గోదావరి జిల్లాల్లో కోళ్ల సంఖ్య గణనీయంగా తగ్గింది. వైరస్ ప్రభావానికి ముందు కోటీ 20 లక్షల కోళ్లు ఉంటే ప్రస్తుతం 85 లక్షలు ఉన్నాయి. దాణా ధరలు తగ్గినా.. కోళ్ల సంఖ్య తగ్గటంతో గుడ్ల ఉత్పత్తి తగ్గిందని అంటున్నారు. దీంతో పాటు ధర కూడా ఆశాజనకంగా లేక నష్టాలు చూస్తున్నారు.
బ్యాంకుల సాయం
పౌల్ట్రీ రైతులు ఎదుర్కొంటున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని బ్యాంకులు జూన్, జులై నెలలలో అదనపు రుణాలు మంజూరు చేశాయి. గతంలో వారు తీసుకున్న రుణ స్థాయిని బట్టి జూన్లో 10 శాతం, జులైలో 20 శాతం అదనపు రుణాలను మంజూరు చేశాయి. గతంలో కోటి రూపాయలు రుణం తీసుకున్న రైతుకు తాజాగా 2 విడతల్లో 30 లక్షల రూపాయలు అదనంగా రుణం ఇచ్చారు. దీంతో ఆర్థికంగా వెసులుబాటు కలిగిందని రైతులు అంటున్నారు. తీసుకున్న రుణాన్ని 6 నెలల తర్వాత నెలనెలా చెల్లించేలా బ్యాంకులు అవకాశం కల్పించడం రైతులకు మరింత ఆశాజనకంగా మారింది.
ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన పౌల్ట్రీ పరిశ్రమకు భవిష్యత్తులోనూ మనుగడ ఉంటుందో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి పరిశ్రమను ఆదుకుంటే తప్ప గట్టెక్కే పరిస్థితులు లేవని స్పష్టం చేస్తున్నారు. పరిశ్రమకు అవసరమైన రాయితీలను కల్పించాలని కోరుతున్నారు.
ఇవీ చదవండి..