అప్పు ఇచ్చిన వ్యక్తినే చంపారు కొంతమంది దుండగులు. గతనెలలో పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో అదృశ్యమైన విశ్రాంత ఆర్టీసీ డ్రైవర్ కేసును పోలీసులు ఛేదించారు. రామచంద్రారెడ్డి అనే విశ్రాంత ఆర్టీసీ డ్రైవర్ ఫిబ్రవరి 16న అదృశ్యమయ్యాడని... కొడుకు లక్ష్మీనారాయణ రెడ్డి 20న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని మిస్సింగ్ విషయంలో అనుమానం కలగడంతో.. పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు. రామచంద్రారెడ్డిది అదృశ్యం కాదని అతని వద్ద అప్పు తీసుకున్న దుర్గాప్రసాద్ అతని అనుచరులే చంపారని నిర్ధారణకు వచ్చారు.
మంచాల యేసు, గడేసుల రామకృష్ణ హత్యచేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడయ్యింది. రామచంద్రారెడ్డి అప్పు ఇమ్మని వేధించడం, సొమ్ము అధికంగా తీసుకోవడం వంటి విషయాలతో కక్ష పెంచుకున్న దుర్గాప్రసాద్.. అతనిని చంపాలని నిర్ణయించుకున్నాడు. పథకం ప్రకారం రామచంద్రారెడ్డిని కారు ఎక్కించుకుని పెడతాడేపల్లి వద్ద కారులో ఉన్న పాలిష్ క్లాత్‌తో హత్యచేశారు. అనంతరం శవాన్ని పడాల అయ్యప్పస్వామి గుడి వద్ద ఏలూరు కాలువలో పడేసినట్లు నిందితులు పోలీసులకు తెలిపారు. నిందితుల నుంచి రెండు ఉంగరాలు, బ్రాస్లైట్, హత్యకు ఉపయోగించిన పాలిష్ క్లాత్, కారును స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ఈ కేసులో అత్యంత చాకచక్యంగా వ్యవహరించి...ఛేదించారు. తాడేపల్లిగూడెం టౌన్ సీఐ ఆకుల రఘు, ఎస్సై గురవయ్య, సిబ్బందిని డీఎస్పీ శ్రీనాథ్ అభినందించారు.
ఇదీ చూడండి. తల్లిని దారుణంగా హతమార్చిన కుమార్తె.. కారణం..?