పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో అధిక వడ్డీలు, చిట్టీలపేరుతో పలువురిని సుమారు 6 కోట్ల రూపాయిలకు టోకరా వేసి పరారైన కంచన రమేశ్, దివ్య దంపతులను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 450 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు నరసాపురం డీఎస్పీ కె .నాగేశ్వరరావు తెలిపారు. రమేశ్, దివ్య దంపతులు విలాసాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించేందుకు చిట్ ఫండ్ వ్యాపారం మొదలుపెట్టారు. చిట్టీలతో పాటు అధిక వడ్డీలు ఆశ చూపి పలువురు నుంచి కోట్లాది రూపాయిలు వసూలు చేశారు. వీరిలో కొందరికి వడ్డీలు కూడా కట్టకుండా వారి పేరుపై చీటీలు కడుతున్నట్లు నమ్మించారు. ఈ విధంగా మోసాలకు పాల్పడిన వీరు వసూలు చేసిన సొమ్ముతో విలాసవంతమైన జీవితం గడిపారు. వీరిని నమ్మి కోట్ల రూపాయిలు వడ్డీలకు ఇవ్వటంతో పాటు బంగారు ఆభరణాలు కూడా ఇచ్చారు. చివరికి బాకీ దారుల నుంచి ఒత్తిడి పెరగటంతో పరారవ్వాలని నిర్ణయించుకున్నారు.
కొత్త పథకంతో మరికొంత దోచారు
పారిపోవాలని అనుకున్న వీరు మరికొందరిని మోసం చేసేందుకు కొత్త పథకం వేశారు. బంధువులు, స్నేహితులు వద్దకు వెళ్లి శుభకార్యాలకు వెళుతున్నాం మీరు ఆభరణాలు ఇస్తే రాగానే ఇచ్చేస్తామని నమ్మబలికారు. ఇలా పలువురు నుంచి విలువైన బంగారు వస్తువులను తీసుకుని వాటిని పలు ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలలో తాకట్టులు పెట్టారు. లక్షలాది రూపాయిలు తీసుకుని పరారయ్యారు. సుమారు 60 మంది వీరి బాధితులు ఉండగా 17 మంది బాధితులు తమను ఆశ్రయించారని పోలీసులు వెల్లడించారు. జిల్లా ఎస్పీ నవదీప్ సింగ్ గ్రావెల్ ఆదేశాలతో వీరిని పట్టుకునేందుకు బృందాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో వీరిని తూర్పు గోదావరి జిల్లా శివకోడులో అరెస్ట్ చేసి 450 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. వీరికి సమీప బంధువు వరదా సూరజ్ సహకరించినట్లు తెలియటంతో అతనిని కూడా అరెస్ట్ కోర్టులో హాజరు పరిచామని తెలిపారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ 17 లక్షలు రూపాయిలు ఉంటుందని, ఫైనాన్స్ కంపెనీలలో తాకట్టు పెట్టిన నగల విలువ 20 లక్షలు రూపాయిలు ఉంటుందని అన్నారు. వాటిని త్వరలో బయటకి తీసుకువస్తామని తెలిపారు.