పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం సమీపంలో అదే గ్రామానికి చెందిన దేశావతు రవి అనే వ్యక్తి శనివారం సాయంత్రం ద్విచక్రవాహనంపై తన పొలం వైపు వెళ్తున్నాడు. పోలీసులు అతడిని గమనించి వెంట వెళ్లారు. అనుమానంతో ఆపి వివరాలు అడిగారు. రవి సమాధానం సరిగా లేకపోవడంతో.. నాటుసారా తరలిస్తూ అబద్ధాలు చెబుతున్నావంటూ.. పోలీసులు కర్రలతో విచక్షణారహితంగా కొట్టినట్లు బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
పోలీసులు కొట్టిన దెబ్బలకు తాళలేక రవి ఘటనాస్థలంలోనే అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. స్థానికులు బాధితుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అక్కడకి చేరుకున్న కుటుంబ సభ్యులు రవిని ఏలూరు ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని కోమాలోకి వెళ్లినట్లు వైద్యులు తెలిపారు. రవిని అనవసరంగా కొట్టారని బాధితుడి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ ఘటనపై చింతలపూడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి: ఎంసెట్ సహా...పలు ప్రవేశ పరీక్షలు వాయిదా: మంత్రి సురేశ్