ప్రైవేట్ పాఠశాలల కన్నా మెరుగ్గా ప్రభుత్వ పాఠశాలల విద్యను బోధిస్తుండటంతో పశ్చిమగోదావరి జిల్లాలో తల్లిదండ్రుల ఆలోచనా ధోరణి మారుతోంది. తమ పిల్లలను కార్పొరేట్ పాఠశాలల నుంచి మాన్పించి ప్రభుత్వ బడుల్లో చేర్పించేందుకు ముందడుగు వేస్తున్నారు. దీని ప్రభావమే.... జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో సీట్లు లేవనే బోర్డులు దర్శనమివ్వడం. జిల్లాలో ఏలూరు, సత్రంపాడు, తణుకు, నరసాపురం, ఆకివీడు, శనివారపుపేట, భీమడోలు, దువ్వ, పాలకొల్లు ప్రభుత్వోన్నత పాఠశాలలు విద్యార్థులతో కిక్కిరిసిపోతున్నాయి. ప్రస్తుతం ప్రైవేట్ పాఠశాలల కన్నా ప్రభుత్వ బడుల్లోనే బోధన, సౌకర్యాలు బాగున్నాయని తల్లిదండ్రులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆరో తరగతి నుంచి పది దాకా గతేడాది కంటే 20 శాతం విద్యార్థుల సంఖ్య పెరిగిందని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల ప్రమాణాలు పెంచేందుకు గత కొన్నేళ్లల్లో ఉపాధ్యాయులు బాగా కృషి చేశారని అభినందిస్తున్నారు. సర్కారీ బడుల్లో కొత్తగా చేరేవారిలో ఎక్కువ మంది కార్పొరేట్ పాఠశాలల నుంచే వస్తున్నారని అధికారులు చెబుతున్నారు. ఈ స్థాయి ప్రమాణాలు కొనసాగిస్తే భవిష్యత్‌లో తల్లిదండ్రుల తొలి ప్రాధాన్యం ప్రభుత్వ పాఠశాలలే అవుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.