పశ్చిమగోదావరి జిల్లాలో పండించిన మొత్తం 16 లక్షల టన్నుల ధాన్యంలో 10 లక్షల టన్నుల ధాన్యం అమ్మకానికి మాత్రమే ప్రభుత్వం అనుమతినివ్వడాన్ని టీడీఎల్పీ ఉపనేత నిమ్మల రామానాయుడు తప్పుబట్టారు. మిగిలిన 6 లక్షల టన్నుల ధాన్యం ఎవరికి అమ్ముకోవాలని ప్రశ్నించారు. ఎకరానికి 53 బస్తాలు దిగుబడి అంచనా వేసిన ప్రభుత్వమే 36 బస్తాలు కొనుగోలు చేస్తామంటే రైతులు ఏమైపోవాలని నిలదీశారు.
గత సంవత్సరం రబీ సీజన్‌లో 12.50 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసిన ప్రభుత్వం ఈ సంవత్సరం దిగుబడులు పెరిగాయని చెప్పి 10 లక్షల టన్నుల కొనుగోలుకి కుదించడం ఏంటని ప్రశ్నించారు. వైకాపా రివర్స్ పాలనలో అన్నీ ఇలానే ఉంటాయని ధ్వజమెత్తారు.
ప్రభుత్వం ధాన్యం కొనుగోలును నిలిపివేయడం వల్ల రైతు మద్దతు ధర కోల్పోతున్నాడని ఆక్షేపించారు. ఈ-కర్షక్ అని అర్థం లేని నిబంధనలు పెట్టి కార్యాలయాల చుట్టూ తిప్పుతూ కౌలు రైతులను ఇబ్బందులు పెడుతుందన్నారు.
ఇదీ చదవండి: