ఈనెల 25న అర్హులైన ప్రతి పేదవానికి ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీకి ఏర్పాట్లు పూర్తిచేశామని... రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు పేర్కొన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 30.75 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీకి సిద్ధం చేశామని తెలిపారు. ఇళ్ల స్థలాల కోసం 68,361 ఎకరాల భూమిని సేకరించామని చెప్పారు. పట్టాలు ఇచ్చిన ప్రాంతాల్లో డిసెంబర్ 25నే 15.6 లక్షల ఇళ్ల నిర్మాణం ప్రారంభం అవుతుందని స్పష్టం చేశారు. 175 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గంలో 8,914 ఇళ్లు చొప్పున పనులు ప్రారంభం కానున్నాయన్నారు. 8,838 కొత్త లే అవుట్లలో 11.26 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు.
గత ప్రభుత్వ కాలంలో ఇంటి నిర్మాణాలకు చెల్లించవలసిన 1400 కోట్ల బకాయిలలో ఇప్పటికే 500 కోట్లు చెల్లించామన్నారు. మిగిలిన 900 కోట్లు డిసెంబర్ 25న చెల్లిస్తామని చెప్పారు. రాష్ట్రంలో 3 లక్షల 65వేల 987 ఇళ్ల స్థలాలపై కోర్టు కేసులు ఉన్నాయన్నారు. కోర్టు కేసులు కారణంగా ఇళ్ల స్థలాలు ఇవ్వలేకపోతున్న ప్రాంతాల్లో లబ్ధిదారులుగా ఎంపికైన వారికి, కేసులు పరిష్కారం కాగానే పట్టాలు ఇస్తామంటూ లేఖ ఇవ్వాలని నిర్ణయించామని మంత్రి వివరించారు. వచ్చే మూడేళ్లలో 28.3 లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలిపారు. రెండో దశలో 12.7 లక్షల ఇళ్ల నిర్మాణం చేపడతామన్నారు. టిడ్కో ఇళ్లలో 365, 430 చదరపు అడుగుల ఫ్లాట్లపై ముఖ్యమంత్రి ప్రకటించిన తాజా రాయితీల ప్రకారం అదనంగా 482 కోట్ల ఖర్చును ప్రభుత్వం భరించనుందని వివరించారు.
ఇవీ చదవండి