గులాబ్ తుపాను (gulab cyclone) కారణంగా ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో పంట నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు అన్నారు. సుమారు 169 మండలాల్లో పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమిక అంచనా వేసినట్లు వెల్లడించారు. లక్షా 56 వేల ఎకరాల్లో నష్టం జరిగినట్లు ఇప్పటివరకు అంచనా వేసినట్లు తెలిపారు. లక్షా 16 వేల ఎకరాల వరి, 21 వేల ఎకరాల మొక్కజొన్న పంట దెబ్బ తిన్నట్లు స్పష్టం చేశారు. కృష్ణాలో 10,588 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అంచనా వేసినట్లు మంత్రి కన్నబాబు తెలిపారు.
రాష్ట్రంలో 7,207 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని మంత్రి కన్నబాబు అన్నారు. తుపాను వల్ల 6,700 మంది రైతులు నష్టపోయారని వెల్లడించారు. నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని సీఎం ఆదేశించారని.. పంటనష్టం సమగ్ర అంచనాకు బృందాలను పంపుతున్నామని స్పష్టం చేశారు. కృష్ణా, గోదావరి జిల్లాల కాల్వల్లో గుర్రపుడెక్క తొలగించాలని కన్నబాబు అన్నారు.
రాష్ట్రంలో వ్యవసాయాన్ని సీఎం పట్టించుకోవడంలేదంటూ తెదేపా నేతలు తప్పుడు ప్రచారం చేయడం సరి కాదని మంత్రి కన్నబాబు అన్నారు. రాయలసీమపై చంద్రబాబు సహా తెదేపా నేతలు ముసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు. సీఎంకు రాయల సీమ దుర్భిక్షపరిస్థితులు తెలుసుకాబట్టే.. సాగునీటి ప్రాజెక్టులు చేపడుతున్నారని పేర్కొన్నారు. సీఎం జగన్పై పవన్ కల్యాణ్ అసూయ, ద్వేషాన్ని ప్రదర్సిస్తున్నారని ఆరోపించారు. సినీ రంగంలోనూ కులాలను ఆపాదిస్తున్నారన్నారు. ఆన్ లైన్ టికెటింగ్ ఇష్టం లేకపోతే ప్రధాని మోదీకి పవన్ కల్యాణ్ లేఖ రాయాలన్నారు.
ఇదీ చదవండి: