సమస్య ఉన్న చోటల్లా సాయం అందాలన్నది ఆమె తపన. అందుకు వయసుతో సంబంధం లేదని నిరూపిస్తూ.. అహర్నిశలూ శ్రమిస్తున్నారు. ఎలాంటి కష్టమైనా నేనున్నా అంటూ ముందుకొస్తూ.. ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆమె పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన నిర్మల.. ప్రస్తుతం ఆమె మానవతా స్వచ్ఛంద సంస్థ రీజియన్ ఛైర్‌పర్సన్‌గా పని చేస్తున్నారు. 2014 వరకూ ఏలూరు జడ్పీ కార్యాలయంలో పర్యవేక్షణాధికారిగా పని చేసి ఉద్యోగ విరమణ పొందారు. ఉద్యోగిగా ఉన్న సమయంలో స్నేహితులు, తోటి మహిళల సాయంతో.. ఓ చిన్న కిట్టిపార్టీని ఏర్పాటు చేశారు. అలా ఆ బృందంతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. అనంతరం మానవతా సంస్థలో రీజియన్ ఛైర్మన్ అయ్యాక తన సేవలను మరింత విస్తృతం చేశారు.
అంత్యక్రియలు చేయడం ప్రత్యేకత..
అంతిమయాత్రకు రథాలు సమకూర్చడం, అనాథ శవాలకు అంత్యక్రియలు చేయడం మానవతా సంస్థ ప్రత్యేకత. అయితే నిర్మల మరో ముందడుగు వేసి.. విద్య, నేత్రదానం, వరద బాధితులకు సాయం, పేద కుటుంబాలకు ఆర్థిక చేదోడు.. ఇలా మరెన్నో కార్యక్రమాలు మొదలుపెట్టారు. సంస్థలోని మహిళలను చైతన్యపరిచి తన సేవను విస్తృతం చేశారు.
పేద విద్యార్థులకు సాయం..
ఆరు పదుల వయసులోనూ అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. రక్తదాన శిబిరాలు నిర్వహించి.. 5వేల యూనిట్ల రక్తాన్ని సేకరించారు. పేద విద్యార్థులకు ఆర్థిక సాయం చేస్తున్నారు. పాఠశాలల్లో సాయంత్రం పేద విద్యార్థులకు అల్పాహారం అందిస్తున్నారు. నిర్మలను ఆదర్శంగా తీసుకుని ఎంతోమంది మహిళలు సంస్థలో చేరారు. తమ వంతు సాయం అందిస్తున్నారు. సంస్థ ద్వారానే తన సేవ మిగిలిపోకుండా వ్యక్తిగతంగా ఎంతోమందికి తోడ్పాటునందిస్తున్నారు. ఒంట్లో సత్తువ ఉన్నంతవరకూ సేవ చేస్తూనే ఉంటానని నిర్మల ఆనందంగా చెబుతున్నారు.
ఇదీ చదవండి: