కృష్ణా జిల్లా
దసరా ఉత్సవాల్లో భాగంగా కనకదుర్గమ్మ వాడవాడలా పూజలందుకుంటోంది. కృష్ణా జిల్లా యనమలకుదురులో చిన్నారులు భక్తి శ్రద్ధలతో దుర్గమ్మకు విశేష పూజలు నిర్వహించారు.
మోపిదేవి గ్రామంలో శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా దుర్గాదేవిగా అమ్మవారిని అలంకరించారు.
పశ్చిమ గోదావరి జిల్లా
శరన్నవరాత్రుల్లో భాగంగా దుర్గాష్టమి రోజు పశ్చిమ గోదావరి జిల్లా గోస్తనీ నదీ తీరాన కనకదుర్గ అమ్మవారు దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజాము నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
ప్రకాశం జిల్లా
ప్రకాశం జిల్లా మార్టూరు మండలం ద్రోణాదులలో శ్రీ అంకమ్మ తల్లి దేవాలయంలో దసరా ఉత్సవాలు కన్నులపండుగగా సాగుతున్నాయి. శ్రీ అంకమ్మ తల్లి.. శ్రీ దుర్గామాత అలంకారంలో దర్శనమిచ్చారు.
నెల్లూరు జిల్లా
నెల్లూరు జిల్లా నాయుడుపేటలో శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. జంబుకేశ్వర స్వామి ఆలయంలో అఖిలాండేశ్వరి దేవికి కుంకమ అలంకరణ ఆకట్టుకుంది.
విశాఖపట్నం
విశాఖపట్నం వైశాఖి జల ఉద్యానవనంలో పాత్రికేయులు దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా కోలాటం, శాస్త్రీయ నృత్యాలు, లక్కీ డిప్ తదితర వినోద కార్యక్రమాలను నిర్వహించారు.
గుంటూరు జిల్లా
గుంటూరు జిల్లా కొండపాటూరులో పోలేరమ్మ తల్లి ఆలయంలో దసరా నవరాత్రి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. పోలేరమ్మ తల్లి దుర్గాదేవిగా భక్తులకు దర్సనమిచ్చారు. కార్యక్రమంలో భాగంగా తొమ్మిది మంది బాలికలకు కుమారి పూజ చేశారు.
తూర్పు గోదావరి జిల్లా
రాజమహేంద్రవరం దేవీచౌక్‌లో అమ్మవారు దుర్గాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. విద్యుత్ దీపాలంకరణతో ఆ ప్రాంతమంతా దేదీప్యమానంగా వెలిగింది. విద్యుత్ దీపాలతో ఏర్పాటు చేసిన పలు రకాల బొమ్మలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
అనంతపురం జిల్లా
అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. మహిళలు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని 61 పట్టుచీరలతో అలంకరించారు.
ఇదీ చూడండి: కన్యకాపరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న వెల్లంపల్లి