రాష్ట్రంలో ప్రాజెక్టులు నిలిపివేస్తే ప్రజలు నష్టపోతారని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. గత ప్రభుత్వ అవకతవకలు సరిచేసుకుంటూ ముందుకు వెళ్లాలే తప్ప... ప్రాజెక్టులను మొత్తానికే నిలిపివేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. అమరావతి నిర్మాణం నిలిపివేయడం వల్ల దాదాపు 20వేల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కోల్పోయారని అన్నారు. చిల్లర రాజకీయాల మూలంగా రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయన్నారు. జమ్మూ కశ్మీర్ లాంటి సమస్యకు పరిష్కారాలు వెతుకుతున్నప్పుడు... కాపుల రిజర్వేషన్ సమస్యను పరిష్కరించటం చాలా సులువన్నారు. కాపుల రిజర్వేషన్‌ను జగన్ రాజకీయ కోణంలో చూస్తున్నారని విమర్శించారు.
రెండు రోజుల పర్యటన నిమిత్తం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వెళ్లిన పవన్... ఇసుక కొరతతో రెండు నెలలుగా పనులు లేక లక్షలాదిమంది కార్మికులు దుర్భర పరిస్థితి అనుభవిస్తున్నారన్నారు. కొత్తగా ఏర్పడిన వైకాపా ప్రభుత్వంపై 100 రోజుల వరకు ఏమీ మాట్లాడకూడదని నిర్ణయించుకున్నప్పటికీ... ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు పడుతున్న కష్టాలు చూసి ప్రభుత్వానికి లేఖలు రాయాల్సి వచ్చిందని తెలిపారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తుపై ఇంకా ఆలోచించలేదని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి : 8న మార్కెట్లోకి కియా కొత్త కారు..సీఎంకు ఆహ్వానం