Jaggery sales In innovative way: దశాబ్దకాలం కిందటి వరకు రైతులకు లాభాలు తెచ్చిపెట్టిన బెల్లం తయారీ పరిశ్రమ... ప్రస్తుతం గడ్డుపరిస్థితి ఎదుర్కొంటుంది. గత నాలుగైదు సంవత్సరాలుగా దీన్ని తయారు చేసే రైతులు నష్టాల్లో కూరుకుపోతున్నారు. తయారీ ఖర్చులు పెరిగినప్పటికీ మార్కెట్ ధరలు పెరగకపోవడంతో పశ్చిమ గోదావరి జిల్లా రైతులు వినూత్నంగా ఆలోచించారు. తయారు చేసిన బెల్లాన్ని మధ్యవర్తుల సాయం లేకుండా నేరుగా వినియోగదారులకు అమ్మి కష్టానికి తగిన ఫలితం పొందుతున్నారు.
లాభాల కోసం ప్రత్యామ్నాయ మార్గాలు..
10 సంవత్సరాల కిందటి వరకు జిల్లా వ్యాప్తంగా నాలుగు వందలకు పైగా బెల్లం తయారీ కేంద్రాలు ఉండేవి. ఇరగవరం, ఉండ్రాజవరం, నిడదవోలు, చాగల్లు, కొవ్వూరు తదితర మండలాలకు చెందిన రైతులు బెల్లం తయారీకి పేరు పొందారు. కాలక్రమేణ బెల్లం తయారీ ఖర్చులు పెరగటం... మార్కెట్ ధరలు అంతగా పెరగకపోవడంతో పరిశ్రమ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటూ వచ్చింది. గత నాలుగైదు సంవత్సరాలుగా నష్టాల్లో కూరుకుపోయిన రైతులు లాభాల కోసం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించారు. తామే నేరుగా వినియోగదారులకు అమ్మేందుకు బెల్లం తయారుచేసేచోట విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
తినుబండారాలు సైతం..
కేవలం బెల్లం మాత్రమే కాకుండా బెల్లం పానకం... బెల్లంతో తినుబండారాలను తయారుచేయించి సైతం అమ్ముతున్నారు. ఈ విక్రయ కేంద్రాల ద్వారా మార్కెట్కు సరఫరా చేస్తే వచ్చే నష్టాల నుంచి బయట పడగలుగుతున్నామని రైతులు చెబుతున్నారు. బెల్లం తయారీకి రూ. 42 ఖర్చు అవుతుంటే మార్కెట్లో రూ 39 మాత్రమే ధర లభిస్తుండడంతో మూడు రూపాయలు పైగా నష్టపోతున్నామని చెబుతున్నారు. తాము నేరుగా వినియోగదారులకు అమ్మడం వల్ల లాభం పొందుతున్నామని పేర్కొన్నారు. మరికొంతమంది కుటుంబ సభ్యులంతా కలిసి బెల్లం తయారు చేసి నేరుగా వినియోగదారులకు అమ్మడం ద్వారా లాభం లేకపోయినా తమ శ్రమకు తగిన ఫలితం లభిస్తుందని చెబుతున్నారు.
ఇతర రాష్ట్రాలపై ఆధారపడుతున్న వ్యాపారులు..
పశ్చిమ గోదావరి జిల్లాలో బెల్లం తయారీ రైతులు నేరుగా వినియోగదారులకు అమ్మడంతో ఆ జిల్లాలోని వ్యాపారులు, ఎగుమతిదారులు ఇతర రాష్ట్రాలు నుంచి వచ్చే బెల్లం మీద ఆధార పడుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుని రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు ఎగుమతి చేస్తున్నామని వ్యాపారులు చెబుతున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని తెలిపారు.
ఇదీ చదవండి: Sid Naidu: నాడు పేపర్ బాయ్.. నేడు "పవర్ ఐకాన్"