గోదావరి నదిలో వరద ప్రవాహం గంటగంటలకు ఉద్ధృతమవుతోంది. ఆదివారం వరకు లక్ష క్యూసెక్కులు ఉన్న నీటిస్థాయి... సోమవారం 3.22 లక్షల క్యూసెక్కులకు చేరింది. గతంలో గోదావరికి ఎంతటి వరదొచ్చినా సాఫీగా సాగిపోయేది. పోలవరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన కాఫర్ డ్యామ్.... ప్రవాహానికి అడ్డుగా మారింది. దీనివల్ల నదిలో నీరు ఆగి ప్రవహిస్తోంది. వరద వస్తే నీళ్లు వెళ్లడానికి రెండువైపులా 600 మీటర్లు ఖాళీ వదిలేశారు. ప్రస్తుతం ఈ 600 మీటర్ల పరిధిలోనుంచే వరదనీరు ప్రవహిస్తోంది. కానీ ఆ స్థలం సరిపోకపోవడంతో 19 మీటర్ల మేర నీటిమట్టం ఉన్నట్లు లెక్కించారు. దీంతో అక్కడి ఏజెన్సీలోని 19 గ్రామాలకు రాకపోకలు నిలిచేలా ఉన్నాయని అధికారులంటున్నారు. ఎగువన ఇంద్రావతి బేసిన్ నుంచి పెద్దఎత్తున ప్రవాహం వస్తోందని..శబరి, సీలేరు కూడా పొంగిపొర్లుతుండడంతో నదీ ప్రవాహం పెరుగుతోందన్నారు. నేటి సాయంత్రానికి 25.5 మీటర్లకు ప్రవాహాం చేరనుంది. కాఫర్ డ్యాం వద్ద నీటిమట్టం 28 మీటర్లకు చేరితే... గోదావరి జిల్లాల్లోని 27 గ్రామాలు, 60 ఆవాస ప్రాంతాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేశారు. గతంలో... భద్రాచలం వద్ద 40 అడుగుల వరద ప్రమాద హెచ్చరిక జారీ చేస్తేనే.... పోలవరం మండలం కొత్తూరు రహదారిపైకి నీరుచేరేది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి మట్టం 15 అడుగులకు చేరకుండానే రహదారి వాగులా మారింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న అధికారులు.. పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని 23గ్రామాల ప్రజలను గతకొన్ని రోజులనుంచే పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని అనేక మండలాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పొలాలు ముంపునకు గురయ్యాయి. చేలల్లో నీరు నిలిచేసరికి వరిసాగుకు సిద్ధమైన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 9,667 ఎకరాల్లో వరి నాట్లు మునిగిపోయాయని అంచనా వేస్తున్నారు. విశాఖ జిల్లాలోని పాడేరు మన్యంలో భారీ వర్షాలకు కొండవాగులు, గెడ్డలు పొంగుతుండటంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదు.
గోదావరి పరిసర ప్రాంతాల్లో టెన్షన్..
దేవీపట్నం వద్ద గోదావరి వరద ఉద్ధృతి పెరుగుతోంది. ఎ.వీరవరం వద్ద కడెమ్మవాగు పొంగిపొర్లుతోంది. బూరుగుబొందు, తొయ్యేరులలో పంట పొలాల్లోకి వరద నీరు చేరింది. పూడిపల్లి వద్ద సీతపల్లి వాగుకు గోదావరి పోటెత్తింది. దండంగి వాగు వద్ద చప్టాపైన వరద ప్రవాహిస్తోంది. గోదావరి వరద ప్రవాహం పెరగడంతో పరిసర గ్రామాల ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కచ్చులూరు నుంచి కొండమొదలు వరకు 16 గిరిజన గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కిరోసిన్ పంపిణీ చేయాలని స్థానికులు కోరుతున్నారు.
ఇదీ చూడండీ:పొంగి పొర్లుతున్న డుడుమ జలపాతం