పశ్చిమ గోదావరి జిల్లాలో..
ఎన్ని ఆటంకాలు వచ్చినా దేవుడి దయతో వాటిని అధిగమించి.. ఇళ్ల పట్టాలు పంపిణీ సాఫీగా జరుగుతోందని దెందులూరు ఎమ్మెల్యే కొట్టారు అబ్బాయి చౌదరి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం పోతునూరు గ్రామంలో.. ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబుతో కలిసి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు.
12 ఏళ్ల క్రితం వైఎస్ రాజశేఖర్రెడ్డి సహకారంతో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ జరిగిందని వారు అన్నారు. అప్పటికీ, ఇప్పటికీ భూముల ధరలు భారీగా పెరిగాయని.. అయినప్పటికీ పేదల సొంతింటి కల నిజం చేయాలనే లక్ష్యంతో భూములు కొనుగోలు చేసి పథకాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. ఇందుకు సమన్వయంతో కృషి చేసిన పలు శాఖల అధికారులను అభినందించారు. లబ్ధిదారులు కొంత మొత్తం సొంతంగా వెచ్చించి గృహాలు నిర్మించుకోవాలని సూచించారు. దీనివలన నాణ్యత పెరగడంతో పాటు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నిర్మాణాలు చేసుకోవచ్చన్నారు.
నెల్లూరు జిల్లాలో..
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం కట్టుబడిపాలెంలో జలవనరుల శాఖా మంత్రి అనీల్ కుమార్ యాదవ్ అర్హులకు ఇళ్ల పట్టాల పంపిణీ చేశారు. కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తోకలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. అర్హులైన పేదలందరికి ఇళ్ల స్థలాలు అందిస్తామని మంత్రి, ఎమ్మెల్యేలు వెల్లడించారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకువచ్చేలా కొన్ని పత్రికలు, మీడియా కథనాలు ప్రచురిస్తున్నాయంటూ మండిపడ్డారు.
ఇదీ చదవండి: 'ప్రాచీన సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదీ'