High Court on Kovvali Pond: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం కొవ్వలి గ్రామ పరిధిలోని 304 ఎకరాల చెరువును ఆక్రమణ నుంచి రక్షించే దిశగా హైకోర్టు కీలక ఉత్తర్వులిచ్చింది. 304 ఎకరాల మొత్తాన్ని సర్వే నిర్వహించి నివేదిక ఇవ్వాలని ఏలూరు జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. ఆక్రమణలు తొలగించి చెరువును పూర్తి స్థితికి తీసుకురావాలని స్పష్టం చేసింది. నీటి వనరులను ఆక్రమణల నుంచి రక్షించాలని సర్వోన్నత న్యాయస్థానం ఇప్పటికే పలు సందర్భాల్లో గుర్తు చేసిందని, ఈ మేరకు తీర్పు ఇచ్చిందని పేర్కొంది. ఏపీ హైకోర్టు సైతం చెరువులు, కుంటలు, కాలువలను రక్షించేందుకు తీర్పు ఇచ్చిందని తెలిపింది. పర్యావరణాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. నివేదిక సమర్పించాలని కలెక్టర్‌ను ఆదేశిస్తూ తదుపరి విచారణను జూన్ 13కు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్.రఘునందన్‌రావు ఈమేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.
కొవ్వలి గ్రామ పరిధిలోని సర్వే నంబరు 131/4లో విస్తరించి ఉన్న 304 ఎకరాల సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ భూమి ఆక్రమణలకు గురైందని, భూమి స్వభావాన్ని మార్చేసి వ్యవసాయం సాగు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని పేర్కొంటూ ‘గ్రామదీప్ చారిటబుల్ ట్రస్ట్’ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ సౌందర్య మనోహరి, మరో ఇద్దరు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది గూడపాటి వెంకటేశ్వరరావు వాదనలు వినిపించారు. సంబంధిత చెరువు నుంచి అందే నీటి ద్వారా 3వేల 500 ఎకరాల వరకు సాగు చేసుకుంటారన్నారు. తాగు నీటికి వినియోగిస్తారన్నారు. దెందులూరు తహశీల్దార్ 304 ఎకరాలలో 177 ఎకరాలను ‘క్రిష్టియన్ భూములు’గా పేర్కొంటూ రెవెన్యూ రికార్డులో మార్పులు చేశారన్నారు. ఆ 177 ఎకరాల్లో ప్రస్తుతం సాగు చేసుకుంటున్నారన్నారు. చెరువుకు చెందిన 304 ఎకరాల్లో ఎలాంటి సాగు చేయకుండా నిలువరించేలా అధికారులను ఆదేశించాలని కోరారు.
సకాలంలో రేషన్ చేరుతుంది కదా..?: మొబైల్ వాహనాల ద్వారా పంపిణీ వల్ల ప్రతి నెల సకాలంలో పేదల వద్దకు రేషన్ సరుకులు చేరుతున్నాయి కదా? అని పిటిషనర్‌ను హైకోర్టు ప్రశ్నించింది. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పుడు నిధుల వృథా అవుతున్నాయనే ఆరోపణలు రావడం సాధారణమేనని వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంపై వేసవి సెలవుల తర్వాత తుది విచారణ జరుపుతామని స్పష్టం చేస్తూ వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ మేరకు స్పష్టం చేసింది.
మొబైల్ వాహనాల ద్వారా ఇంటివద్దకే సరుకుల సరఫరా పథకాన్ని, అందుకు సంబంధించిన జీవోలను సవాలు చేస్తూ ‘ఏపీ చౌకధరల దుకాణదారుల సంక్షేమ సంఘం’ అధ్యక్షుడు ఎం.వెంకటరావు, కార్యదర్శి చిట్టిరాజు గతేడాది జులైలో హైకోర్టులో వ్యాజ్యం వేశారు. తాజాగా జరిగిన విచారణలో వారి తరఫు న్యాయవాది కె.శ్రీనివాస్ వాదనలు వినిపించారు. పూర్వ పద్ధతి ప్రకారం చౌక ధరల దుకాణాల ద్వారా సరుకులు పంపిణీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ నిర్ణయంతో పిటిషనర్ సంఘ సభ్యులు ఉపాధి కోల్పోతున్నారన్నారు. రాష్ట్ర ఖజానాపై రూ.600 కోట్ల భారం పడుతుందన్నారు. రేషన్ పంపిణీ వాహనానికి ప్రతి నెల రూ.21వేలు చెల్లిస్తున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రభుత్వ న్యాయవాది శ్రేయాస్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. డీలర్ల వద్దే స్టాక్ ఉంచుతున్నామన్నారు. మొబైల్ వాహనాల ద్వారా పంపిణీతో డీలర్లకు నష్టం లేదన్నారు.
ఇవీ చదవండి: