గోదావరిలో వరదనీరు రోజురోజుకు అధికమవుతోంది. నదిలో 62 వేల క్యూసెక్కుల వరద ప్రవహిస్తుండడంతో ఎగువ కాఫర్ డ్యాం వద్ద నీటిమట్టం 27.7 మీటర్లకు చేరుకుంది. గోదావరి నది నుంచి వరద నీరు అప్రోచ్ ఛానల్ ద్వారా పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే లోకి చేరుతోంది. స్పిల్ వే లోని 48 గేట్ల ద్వారా వరదనీరు స్పీల్ ఛానల్ లోకి ప్రవహించి తిరిగి గోదావరిలో కలుస్తుంది. 48 గేట్లను పూర్తిస్థాయిలో ఎత్తి వరద నీటిని కిందికి వదులుతున్నారు. గోదావరి నదిలో వరద నీరు పెరగడంతో పోలవరం మండలంలోని 12 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎగువ కాఫర్ డ్యామ్ నిర్మాణంతో పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని 48 గ్రామాలకు వరద ముప్పు పొంచి ఉంది.
వెనక్కు మళ్లుతున్న నీరు...
గోదావరిలో ఇంకా వరద రాలేదు. ప్రవాహాలు లక్షల క్యూసెక్కులకు చేరలేదు. కానీ పోలవరం వద్ద జలాశయంలో పెద్ద ఎత్తున నీరు నిలిచి వెనక్కు మళ్లుతోంది. పోలవరం క్రస్ట్ గేట్ల నుంచి నీటిని విడుదల చేస్తున్నా.. వెనక్కు నీరు ఎగదన్నుతోంది. పోలవరం నుంచి ఎగువకు దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో వేలేరుపాడు సమీపంలో గోదావరి వద్ద పెద్ద ఎత్తున నీరు నిలిచిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. భద్రాచలం నుంచి గోదావరిలో పెద్దగా ప్రవాహాలు దిగువకు రాని పరిస్థితుల్లోనూ ఇంత నీరు నిలవడం ఇదే తొలిసారి అని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు.
జలదిగ్బంధంలో ముంపు గ్రామాలు...
వరద లేనప్పుడే కాఫర్ డ్యాం ప్రభావం ఈ స్థాయిలో ఉంటే వరద రోజుల్లో ఇంకే స్థాయిలో ఉంటాయో అన్న ఆందోళన స్థానికుల్లో కనిపిస్తోంది. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలు ఒక్కొక్కటిగా జలదిగ్బంధంలో చిక్కుకుంటున్నాయి. పోలవరం ప్రాజెక్టుకు అత్యంత సమీపంలో ఉన్న ఉభయగోదావరి జిల్లాల్లోని పోలవరం, దేవీపట్నం మండలాల్లో 45 గ్రామాలను నీరు చుట్టుముట్టింది. దీంతో దేవీపట్నం మండలంలోని దాదాపు 15 కు పైగా గ్రామాల ప్రజలు తమ పునరావాసాన్ని తామే ఏర్పాటు చేసుకోవలసి వచ్చింది.
ఇవీచదవండి.