పోలవరం నిర్వాసితులను జులై నెలాఖరులోగా పునరావాస కాలనీలకు తరలిస్తామని సహాయ పునరావాస కమిషనరు ఆనంద్ తెలిపారు. ఉభయగోదావరి జిల్లాల్లో మొత్తం 47 కాలనీలు నిర్మాణంలో ఉన్నాయని వివరించారు. పశ్చిమగోదావరి జిల్లా తాడ్వాయి తప్ప మిగిలిన చోట్ల ఇళ్లు, ఇతర మౌలిక సౌకర్యాల పనులు జరుగుతున్నాయని.. జూన్‌కల్లా 20 నుంచి 25 కాలనీల నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. ఆగస్టులో వరదలొచ్చే నాటికి కాలనీలన్నింటినీ నిర్మించి నిర్వాసితులను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.
అవసరమైతే పునరావాస శిబిరాల ఏర్పాటు
కాలనీల నిర్మాణానికి, ప్యాకేజీ ఇచ్చేందుకు అవసరమైన నిధులనూ ప్రభుత్వం మంజూరు చేసిందని పేర్కొన్నారు. +45.72 కాంటూరు స్థాయిలో తూర్పుగోదావరి జిల్లాలో ఇంకా సామాజిక ఆర్థిక సర్వే పూర్తి చేయాల్సి ఉందని తెలిపారు. 2022 నాటికి పూర్తి చేయగలమని చెప్పారు. ఈ ఏడాది స్పిల్‌వే మీదుగా వరద మళ్లిస్తున్నందున కాఫర్‌డ్యాం వల్ల సమస్య రాదని జల వనరులశాఖ అధికారులు చెబుతున్నారని వివరించారు.
రెండేళ్లుగా స్పిల్‌వే మీదుగా నీళ్లు మళ్లించారని, కాఫర్‌డ్యాం మూసేయడం వల్ల ఈ ఏడాది సమస్య ఇంకా ఎక్కువవుతుందని ఆయన దృష్టికి తీసుకురాగా.. నీరు నిల్వ చేయబోమని జల వనరులశాఖ అధికారులు చెబుతున్నారని ఆయన వివరించారు. నీరు నిల్వ చేయకపోయినా వరద సమయంలో నీటిమట్టాలు పెరుగుతాయని జలవనరుల అధికారులు చెబుతున్నారని ప్రస్తావించగా.. ముంపు గ్రామాలను ఖాళీ చేయిస్తామని అన్నారు. వరద సమయంలో అవసరమైతే రెవెన్యూ యంత్రాంగం పునరావాస శిబిరాలను ఏర్పాటు చేస్తుందని తెలిపారు.
ఇదీ చదవండి: