రాష్ట్రవ్యాప్తంగా శరన్నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో... శ్రీ లక్ష్మీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఎమ్మెల్యే చిట్టిబాబు పూజలు నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో... కన్యకా పరమేశ్వరి అమ్మవారు బాలాత్రిపుర సుందరీ దేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. ఉండ్రాజవరంలో కొలువైన ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో... శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వేకువజాము నుంచి అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
నెల్లూరు జిల్లాలో...
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట శ్రీ చెంగాళ పరమేశ్వరి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య దేవతా మూర్తిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
- దర్గామిట్టలో..
నెల్లూరు నగరంలోని దర్గామిట్టలో వెలసిన రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రెండవ రోజు రాజరాజేశ్వరి అమ్మవారు భవానీ అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఆలయంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు.
- నాయుడుపేటలో..
జిల్లాలోని నాయుడుపేట పురపాలక సంఘం శ్రీ వళ్లీ దేవసేన సుబ్రహ్మణ్యం స్వామి ఆలయంలో దసరా ఉత్సవాలలో భాగంగా కుంకుమ పూజ నిర్వహించారు.
విశాఖ జిల్లాలో...
విశాఖ జిల్లా అనకాపల్లిలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గవరపాలెంలోని శతకం పట్టు వద్ద శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించారు. అమ్మవారు రథాన్ని పట్టణ పుర వీధుల్లో ఊరేగించారు. బాల త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు భక్తులకు అభయ ప్రదానం చేస్తున్నారు. కామాక్షి ఆలయంలో అమ్మవారికి మహిళలు ప్రత్యేక పూజలు చేశారు.
- లక్ష్మీ దేవిపేటలో...
లక్ష్మీ దేవిపేటలోని కనకదుర్గ ఆలయంలో అమ్మవారిని బాలా త్రిపుర సుందరి దేవిగా అలంకరించారు. సత్యనారాయణపురం కనకదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి 20.ప్లస్ సాయి నూకంబిక ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో యువకుల ప్రసాదం పంపిణీ కార్యక్రమం చేపట్టారు. కన్యకా పరమేశ్వరి ఆలయంలో సరస్వతీదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. సర్వకా మదాంబ ఆలయంలో గజలక్ష్మి దేవి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.
- శారదాపీఠంలో..
విశాఖ శారదాపీఠంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు కొనసాగుతున్నాయి. శారద స్వరూప రాజశ్యామల అమ్మవారు నవరాత్రుల్లో రెండో రోజైన మాహేశ్వరి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఒక చేతిలో త్రిశూలం, మరో చేతిలో ఢమరుకంతో వృషభ వాహనంపై ఆశీనులైన అమ్మవారి అవతారం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. రాజశ్యామల అమ్మవారి ఆలయంలో పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారి పాదాల చెంత ప్రతిష్టించిన శ్రీచక్రానికి పంచామృతాలతో అభిషేకాలు చేశారు.
ప్రకాశం జిల్లాలో....
ప్రకాశం జిల్లా మార్టూరు మండలం ద్రోణాదులలోని శ్రీ అంకమ్మతల్లి దేవాలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రెండో రోజు శ్రీ బాల త్రిపురసుందరి దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.
ఇదీ చదవండి:
భక్తులకు పూర్ణఫలము అందించే దేవత...శ్రీబాలా త్రిపురసుందరీదేవి