Godavari Floods : కోతకు గురైన గట్లు.. ఒరిగిపోయిన ఫ్లోరింగ్.. బేస్‌మెంట్ కోతకు గురై గాలిలో ప్రమాదకరంగా ఉన్న ఫుట్‌పాత్.. ఇదీ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణంలోని.. పొన్నపల్లి వద్ద గత వరదలు మిగిల్చిన విధ్వంసం. ఇటీవల గోదావరి నదికి వచ్చిన వరదలు ఏటిగట్ల పటిష్టతను.. తేటతెల్లం చేశాయి. చాలాచోట్ల భారీగా కోతలు పడ్డాయి. పొన్నపల్లి వద్ద.. పాదచారులు నడిచేందుకు ఏర్పాటు చేసిన నడక దారి పూర్తిగా ధ్వంసమైంది.
గట్టు వెంట ఏర్పాటు చేసిన కొన్ని విగ్రహాలూ కోతకు గురై నదిలో కలిసిపోయాయి. సుమారు 2 వారాలపాటు నది ఉద్ధృతికి పట్టణ వాసులు.. భయాందోళనకు గురయ్యారు. బిక్కుబిక్కుమంటూ గడిపారు. వరదలు తగ్గాయి. కానీ పరివాహక ప్రజల భయం మాత్రం తగ్గలేదు. దానికి కారణం ఏటిగట్ల పటిష్టతకు.. శాశ్వత పరిష్కారం చూపకుండా తాత్కాలిక చర్యలతో సరిపెట్టడమే.
వరదల సమయంలో.. అరకోటికి పైగానే ఖర్చు చేసి కర్రలు, ఇసుక బస్తాలు వేశారు. ఇప్పుడు మళ్లీ వరదలు వస్తున్నాయి. ఈ ఇసుక బస్తాలు ఏటిగట్లను.. ఎంతవరకూ కాపాడగలవనేది స్థానికులకు అంతు చిక్కడం లేదు.
ఏటిగట్ల పటిష్టతకు ప్రభుత్వం వద్ద.. ఒక ప్రణాళికంటూ లేదు. ఎక్కడెక్కడ బలహీనంగా ఉన్నాయో.. సర్వే చేసిన పాపాన పోలేదు. పొన్నపల్లి వద్ద ఉన్న గట్టుకు గండిపడితే వరద.. నరసాపురం పట్టణం నుంచి.. ఏలూరు వరకూ ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ధవళేశ్వరం నుంచి రివిట్ మెంట్ పనులు చేపడితేనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం. అప్పుడే పట్టణ వాసులు భయం గుప్పిట నుంచి బయటపడే.. అవకాశం ఉంది. అలా కాదని పైపై పనులు ఎన్ని చేసినా.. ఆ ఖర్చంతా గోదారిపాలు కావాల్సిందే.
ఇవీ చదవండి: