Krishnaraju memorial service: పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో జరగనున్న మాజీ కేంద్రమంత్రి సినీ నటుడు కృష్ణంరాజు సంస్మరణ సభకు ఆయన కుటుంబ సభ్యులు అభిమానులు భారీగా ఏర్పాట్లు చేశారు. ఇవాళ ఉదయం హీరో ప్రభాస్, కృష్ణంరాజు కుటుంబ సభ్యులు తమ స్వగ్రామమైన మొగల్తూరులో పెదనాన్న సంస్మరణ సభలో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ ప్రముఖులతో పాటు ఉభయగోదావరి జిల్లాల నుంచి సుమారు లక్ష వరకు కృష్ణంరాజు, ప్రభాస్ అభిమానులు వస్తారని అధికారులు అంచనా వేశారు.
ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పటిష్ఠమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు అధికార యంత్రాంగం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు రంగంలోకి దిగింది. కృష్ణంరాజు, ప్రభాస్ అభిమానులకు భోజన సదుపాయాలు ఏర్పాటు చేసే విధంగా భారీ ఏర్పాట్లు చేశారు. హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన ఈ నెల 11న కన్నుమూశారు. దశ దిన కర్మను అక్కడే పూర్తిచేసిన కుటుంబ సభ్యులు.. ఆయన స్వగ్రామంలో సంస్మరణ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
ఇప్పటికే కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి, కుమార్తెలు, ఇతర కుటుంబసభ్యులు అక్కడకు చేరుకున్నారు. ఆయన సినీ వారసుడు, సోదరుడి కుమారుడు ప్రభాస్ గురువారం ఉదయానికి అక్కడకు చేరుకుంటారు. వచ్చిన వారందరికీ ప్రభాస్, కుటుంబ సభ్యులు కనిపించి అభివాదం చేసేలా ఏర్పాట్లు చేశారు. ముఖ్యఅతిథులకు ఆయన ఇంటి ఆవరణలో ఏర్పాట్లు చేశారు.
ఇవీ చదవండి: