పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలంలో రైతులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. తమ నుంచి కొనుగొలు చేసిన ధాన్యానికి సొమ్ములు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి మూడు నెలలు గడస్తున్నా.. సొమ్మును చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తణుకు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు విడివాడ రామచంద్రరావు, తదితరులు రైతుల నిరహారదీక్షకు సంఘీభావం తెలిపారు. ధాన్యం సొమ్ములు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.
ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌కు నారుమళ్ళు, నాట్లు పూర్తయ్యే దశలో ఉన్నప్పటికీ ధాన్యం సొమ్ములు రాకపోవడంతో పెట్టుబడులకు నానా ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే ధాన్యం సొమ్ములు విడుదల చేయాలని కోరుతున్నారు.
జనసేన పార్టీ నియోజకవర్గ ఇంఛార్జి విడివాడ రామచంద్రరావు మాట్లాడుతూ ధాన్యం సొమ్ములు విడుదల చేయడానికి భాజపాతో జతకట్టిన జనసేన పార్టీ నాయకులు పవన్ కల్యాణ్ కృషి చేయాలని.. స్థానిక శాసనసభ్యులు కారుమూరి వెంకట నాగేశ్వరావు చెప్పడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. గతంలో జనసేన పార్టీ.. పార్టీ కాదని, పవన్ కల్యాణ్ నాయకుడు కాదని మాట్లాడిన ఎమ్మెల్యే ఇప్పుడు ఎలా మాట్లాడతారని పేర్కొన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన ధాన్యం బకాయిలను విడుదల చేయడానికి రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వం కృషి చేయాలని ఆయన కోరారు.