పశ్చిమగోదావరి జిల్లాలో ఖరీఫ్ వరి సాగు ముమ్మరంగా సాగుతోంది. రైతులు పొలాలను దమ్ము చేసే పనిలో ఉన్నారు. మరికొందరు నాట్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇంకొందరు నాట్లు వేస్తున్నారు. జిల్లాలో 5.5 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని వ్యవసాయ శాఖాధికారులు అంచనా వేశారు. ఇప్పటికే కాలువలకు నీటిని విడుదల చేయడంతో రైతులు సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. బెంగాలీ కూలీలు రాకపోవడంతో స్థానిక కూలీలతో నాట్లు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నాట్లు ఒకేసారి వేయనుండటంతో కూలీల కొరత ఏర్పడే అవకాశం ఉంది. దీన్ని అధిగమించేందుకు రైతులు ఇప్పటికే కూలీలతో ఒప్పందాలు చేసుకుంటున్నారు.
వారితో ప్రయోజనాలెన్నో..
వరి నాట్లు వేయడంలో బెంగాలీ కూలీలు సిద్ధహస్తులు. జిల్లాలో ఖరీఫ్, రబీ సాగులో వీరి పాత్ర కీలకం. ఏటా నాట్లు ప్రారంభమయ్యే సమయానికి పశ్చిమబంగా రాష్ట్రం నుంచి వేలాది మంది వచ్చేవారు. వీరు నాట్లు వేస్తే అనేక ప్రయోజనాలు ఉంటాయని రైతులు చెబుతున్నారు. 50 శాతం వరకు విత్తనం ఆదా అవుతుంది. ఎక్కువ భూమి ఉన్న రైతులకు ఇది ఉపయోగకరం. వీరు వరుస సాళ్ల పద్ధతిలో నాట్లు వేస్తారు. ఫలితంగా పంట ఏపుగా పెరుగుతుంది. దుబ్బు బాగా చేస్తుంది. దూరంగా నాట్లు వేయడం ద్వారా గాలి, వెలుతురు, సూర్యరశ్మి వంటివి దిగుబడి పెరగడానికి ఊతమిస్తాయని రైతులు చెబుతున్నారు. ఎకరం పొలంలో నాట్లు వేసేందుకు బెంగాలీ కూలీలకు రూ.2750 ఇస్తారు. ప్రస్తుతం స్థానిక కూలీలకు రూ.3500 వరకు ఇస్తున్నారు. ఫలితంగా రైతులు ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది. దీనికితోడు సరైన సమయంలో వరినాట్లు పడతాయో లేదో అన్న బెంగ రైతుల్లో నెలకొంది. సీజన్ ఒకేసారి రావడం, కూలీల కొరత, కరోనా భయంతో కొందరు పనులకు వచ్చేందుకు విముఖత చూపుతుండటంతో సాగు ఆలస్యమయ్యే ఆస్కారం ఉందని రైతులు అంటున్నారు. దీనివల్ల నారుమళ్లు ఎక్కువ పెరిగి పంట దిగుబడిపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
యాంత్రీకరణ అవసరం
జిల్లాలో వరిసాగు విస్తీర్ణం చాలా ఎక్కువ. సీజన్ కూడా ఇంచుమించు ఒకేసారి వస్తుంది. కూలీల కొరత పరిపాటి. ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు వ్యవసాయ శాఖ నడుం కట్టాలి. వ్యవసాయంలో యాంత్రీకరణను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని జేడీఏ గౌసియా బేగం వద్ద ప్రస్తావించగా ప్రస్తుతం పెద్ద వరి నాట్ల యంత్రాలకు రాయితీ సౌకర్యం లేదని, సమస్యను ఉన్నతాధికారులకు నివేదించామన్నారు. త్వరలో రాయితీపై యంత్రాలను సరఫరా చేసే అవకాశం ఉందని తెలిపారు.
ఇదీ చదవండి: ఒక్కరోజులో 24,248 కేసులు.. మూడో స్థానానికి భారత్