పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై ద్వారకాతిరుమల పోలీసులు కేసు నమోదు చేశారు. 2017లో 13 మంది తన ఇంటిపై దాడి చేశారని ద్వారకా తిరుమల మండలం మలసానికుంట గ్రామానికి చెందిన గురజాల ఆదిలక్ష్మి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పట్టించుకోకపోవడం వల్ల ఆమె హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాలతో ద్వారకాతిరుమల పోలీసులు ఎట్టకేలకు తలారి వెంకట్రావుతో పాటు మరో 12 మందిపై కేసు నమోదు చేశారు. తన కోడలు కాపురానికి రాకుండా, కేసులు పెట్టిందని ఆదిలక్ష్మి ఆరోపించారు. ఈ నేపథ్యంలో తలారి వెంకట్రావుతో పాటు మరో 12 మంది తన కోడలికి మద్దతుగా వచ్చి, తన ఇంటిపై దాడి చేశారని ఆరోపించారు.
ఇంట్లో నుంచి గెంటివేసి, తిరిగి ఇంట్లోకి వస్తే పెట్రోలు పోసి సజీవదహనం చేస్తామని బెదిరించారని ఆమె చెప్పారు. ఈ విషయం పలుమార్లు ద్వారకాతిరుమల పోలీసులకు, పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు పట్టించుకోకపోవడం వల్ల హైకోర్టును ఆశ్రయించినట్లు ఆమె చెప్పారు.
ఇదీ చదవండి : పెంజ్ బాక్స్.. అద్భుతమైన స్వదేశీ యాప్