రహదారులు అభివృద్ధికి చిహ్నాలు. అలాంటిది.. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రం రోడ్లు.. రాతి యుగాన్ని తలపిస్తున్నాయి. డెల్టా, మెట్ట ప్రాంతాలకు ప్రధాన మార్గాలైన నరసాపురం, చింతలపూడి రహదారులు గోతులమయమయ్యాయి. జిల్లా కేంద్రమైన ఏలూరు నుంచి నరసాపురం వెళ్లే మార్గం.. దాదాపుగా కంకరతేలి, కొన్ని చోట్ల రెండు, మూడు అడుగుల మేర గోతులు ఏర్పడి అధ్వానంగా తయారైంది. ఈ మార్గానికి ఓవైపు సాగునీటి కాలువ ఉన్న కారణంగా రహదారి ఇరుకైపోయింది. రాకపోకలకు ఇబ్బందిగా మారింది.
నరసాపురం నుంచి కృష్ణా జిల్లాకు వెళ్లాలన్నా.. ఈ దారిలోనే వెళ్లాల్సి ఉంటుంది. ఆక్వాహబ్ గా పేరుగాంచిన భీమవరం పరిసర ప్రాంతాల నుంచి రొయ్యలు, చేపలు, ఫీడ్ వంటివి ఈ రహదారిలో రవాణా కావాల్సి ఉంటుంది. రోజూ వందల వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. అలాంటి రహదారి కంకర, మట్టితేలి దమ్ము చెలరేగుతోంది. ఈ రహదారిలో పది కిలోమీటర్లు ప్రయాణిస్తే చాలు. గుర్తు పట్టలేనంతగా మట్టి పేరుకుపోతోంది. ఏలూరు నుంచి కైకలూరుకు వెళ్లాలంటే కొల్లేరులో ప్రయాణించాల్సి ఉంటుంది. ఇరవై రెండు కిలో మీటర్లు ఉన్న ఈ రహదారిలో ప్రయాణించాలంటే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
ఏలూరు నుంచి కైకలూరు, భీమవరం మధ్య పరిస్థితి ఇలాగే ఉంది. రెండు అడుగులమేర ఉన్న గోతులు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఏలూరు, కైకలూలు, భీమవరం, పాలకొల్లు, నరసాపురం మధ్య రహదారి సైతం గోతులు పడి ప్రయాణం దుర్భరమవుతోంది. ఐదేళ్లుగా ఈ రహదారిపై తారు వేయలేదు. పై పైన మరమ్మతులు చేసి వదిలేశారు. వర్షాలకు రహదారి దెబ్బతింటోంది. మరమ్మతుల కోసం ఐదేళ్లలో 1.80 కోట్ల రూపాయలు ఖర్చు చేసినా ప్రయోజనం లేదు. శాశ్వత ప్రతిపాదికన రోడ్డు వేయాలని ప్రజలు కోరుతున్నారు.
"కైకలురు నుంచి ఏలూరు వరకు ఉన్న రోడ్డు మరీ అధ్వానంగా ఉంది. డెలివరీ కోసం ఈ దారిలో వెళ్తే... మార్గ మధ్యలోనే పురుడు అవుతుంది. రోడ్డంతా గోతులమయం, దుమ్ము, ధూళితో వాహనం ఎటుపోతుందో కూడా తెలియని పరిస్థితి ఉంటుంది. ప్రయాణ సమయం సైతం ఎక్కువగా పడుతుంది" -వాహన చోదకుడు
- ృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రధాన రహదారి దారుణంగా దెబ్బతింది. ఏలూరు నుంచి కైకలూరు 22 కి.మీ. 20నిమిషాలు పట్టాల్సిన ప్రయాణ సమయం రోడ్డు సరిగా లేకపోవటంతో గంటన్నర పడుతోంది. ఇంతలా పాడైన రోడ్లను బాగుచేసేందుకు ఎవరూ ముందుకు రావట్లేదు" - వాహనచోదకుడు
"ఈ రోడ్డు నరకానికి దారిలా ఉంది. రోజూ ప్రయాణించాల్సి రావటంతో వాహనం పాడైపోతోంది. మూడు నెలలకొకసారి టాక్స్ సరిగ్గా కట్టించుకుంటారు. సకాలంలో చెల్లించకపోతే జరిమానా విధిస్తారు. కానీ రహదారులు బాగు చేసేవారు మాత్రం లేరు. వీలైనంత త్వరగా ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాం" -వాహన చోదకుడు
ఇదీ చదవండి: