పశ్చిమగోదావరి జిల్లాలో అధికంగా రైతులు ఆక్వా రంగంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అటు తీరప్రాంతమైన డెల్టాలోను, ఇటు కొల్లేరు ప్రాంతంలోను అధిక విస్తీర్ణంలో చేపలు, రొయ్యల చెరువులు సాగులో ఉన్నాయి. 1.50లక్షల ఎకరాల్లో చేపలు, రొయ్యల చెరువులు విస్తరించాయి. కొవిడ్ కారణంగా ఆక్వారైతులు తీవ్ర నష్టాన్ని చవిచూశారు. పెట్టుబడి పెట్టిన లక్షలాది రూపాయల సైతం వెనక్కురాలేదు. వేసవి సీజన్లో చేపలు అధికంగా ఉత్తారాది రాష్ట్రాలకు ఎగుమతి చేసేవారు.. లాక్‌డౌన్, కొవిడ్ కారణంగా చేపల ఎగుమతులు జరగలేదు.
చేపలకు మేత ఖర్చులు అదనం
రోజు ఐదువందల నుంచి వేయి టన్నుల వరకు చేపలు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అయ్యేవి. కొవిడ్ కారణంగా వంద టన్నులకు మించలేదు. గిరాకీ మందగించి.. ధరలు తగ్గుమఖం పట్టాయి. కిలో రూ. 150 పలకాల్సిన చేపల ధరలు... 80రూపాయలకు పడిపోయాయి. చేపలు పట్టాల్సిన సమయంలో కొనుగోలు చేసే వ్యాపారులు లేక.. చెరువుల్లోనే వదిలేశారు. పట్టుబడి సమయం వచ్చిన చేపలకు అదనంగా మేత ఖర్చులు పెట్టామని రైతులు అంటున్నారు. రెండు కిలోల బరవు వచ్చాక.. చేపలు పట్టుబడిపడతారు. అలాంటిది మూడు, నాలుగు కిలోల వచ్చినా... పట్టుబడి పట్టకపోవడంతో మేత ఖర్చులు పెరిగి.. పెట్టుబడి పెరిగింది. ఎకరానికి సుమారు 50వేల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని చేపల రైతులు అంటున్నారు
పతనమైన రొయ్యల ధర
జిల్లాలో భీమవరం, ఆకివీడు, ఏలూరు, ఉండి, పాలకొల్లు, తణుకు, ఉంగటూరు, నరసాపురం ప్రాంతాల్లో రెండు లక్షల ఎకరాల్లో రొయ్యల చెరువులు ఉన్నాయి. సాధారణంగా మార్చి, ఏప్రిల్ల్లో రొయ్యను విరివిగా సాగు చేస్తారు. సాగుకు వాతావరణం అనుకూలించడం, ధరలు ఆశాజనకంగా ఉండటం వల్ల.. వేసవి సీజన్ ప్రారంభంలో సాగుకు రైతులు మొగ్గు చూపుతారు. ఈ సీజన్లో సైతం లక్ష ఎకరాల విస్తీర్ణంలో రొయ్యలను రైతులు సాగు చేశారు. మే మూడువారం నుంచి రొయ్యల పట్టుబడులు చెరువుల్లో ప్రారంభమయ్యాయి. దాదాపు 80శాతం చెరువుల్లో రొయ్యలు విక్రయానికి సిద్ధమైన సమయంలో లాక్ డౌన్ విధించారు. ప్రొసెసింగ్ యూనిట్లపై ఆధారపడిన రొయ్యల ధరలు వాటి మూతతో ఒక్కసారిగా పతనమయ్యాయి. సాధారణంగా వంద కౌంట్ కిలో రొయ్యలు రూ.250 రూపాయలు పలకాలి, 40కౌంట్ ఐదు వందల రూపాయలకు అమ్ముడుపోవాలి.... అలాంటిది 40కౌంట్ రొయ్యలు వంద రూపాయలకు పడిపోయాయి. ఈ ధరలకు సైతం కొనేవారు లేక.. రైతులు పూర్తిగా నష్టపోయారు.
ఆదుకోండి..
విక్రయానికి సిద్ధమైన సమయంలో లాక్‌డౌన్ విధించారు. ఎక్కడికక్కడ రవాణా స్తంభించడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోయారు. ఆంక్షల ఉపసంహరణ తర్వాత ప్రాసెసింగ్ యూనిట్లు తెరిచినా...ధరలు మాత్రం పెరగలేదు . కరోనా మహమ్మారి వల్ల తీవ్రంగా నష్టపోయిన అక్వా రైతులకు రాయితీలు కల్పించి.. ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి.
Vishaka steel plant: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పునరాలోచన లేదు: కేంద్రం