పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా పదో తరగతి విద్యార్థులపై కరోనా పంజా విసురుతోంది. జిల్లావ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో విద్యార్థులకు కొవిడ్ పాజిటివ్ నిర్ధరణ కావడం ఇందుకు తార్కాణంగా నిలుస్తోంది. జిల్లాలోని వివిధ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు కరోనా సోకటం భయాందోళన కలిగిస్తోంది. చెరుకువాడలో ఐదుగురికి, కొమ్ముచిక్కాలలో ఐదుగురికి, పెరవలి మండలం కానూరులో ఏడుగురికి, నర్సాపురంలో ఒకరికి పాజిటివ్ నిర్ధరణ అయింది. కానూరు ఉన్నత పాఠశాలలో 60 మందికి నిర్వహించిన పరీక్షల్లో ఏడుగురికి పాజిటివ్‌గా నిర్ధరించారు. పరీక్షలు నిర్వహించి ఫలితాలు రావాల్సిన మరో 40 మందిలో ఎంతమందికి పాజిటివ్‌గా తేలుతుందోనని విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు.
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులకు సెలవులు ప్రకటించగా.. పదో తరగతి విద్యార్థులకు మాత్రమే తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలను రద్దుచేసి వారికి కూడా సెలవు ఇవ్వాలని రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ ఊపుందుకుంది.
ఇదీ చదవండి