పశ్చిమగోదావరి జిల్లాలో కొత్తగా నలుగురి కరోనా సోకినట్లు జిల్లా వైద్యాధికారులు తెలిపారు. ఏలూరులోని తంగెళ్లమూడి ప్రాంతానికి చెందిన ముగ్గురికి, పెనుగొండలో ఒకరికి.. కరోనా ఉన్నట్లు నిర్ధరించారు. దిల్లీ మర్కజ్‌కు వెళ్లివచ్చిన వారి ద్వారా వీరికి వైరస్ వ్యాప్తి చెందినట్లు అధికారులు వివరించారు. మొత్తంగా జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 27కు పెరిగినట్లు జిల్లా వైద్యాధికారులు తెలిపారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 973 మంది నమూనాలు సేకరించారు. ఇందులో 678 నెగిటివ్ లు రాగా.. 27పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇంకా 268 నమూనాల ఫలితాలు రావాల్సి ఉంది.
తంగెళ్లమూడి ప్రాంతంలోనే 11పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పెనుగొండలో ఆరుగురికి వైరస్ సోకింది. ఈ గ్రామంలో ఇప్పటికే ఐదు కేసులు నమోదు కాగా మంగళవారం సాయంత్రం మరోకరికి కరోనా ఉన్నట్లు తేలింది. గ్రామంలో లాక్ డౌన్ ఆంక్షలను మరింత కఠినతరం చేశారు. గ్రామంలో ఈనెల 8న మూడు పాజిటివ్ కేసులు బయటపడగా అధికారులు ఆగమేఘాలపై గ్రామంలో ఇంటింట సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా 74 మంది నుంచి శాంపిల్స్‌ను సేకరించి కరోనా పరీక్షలకు పంపించారు. వీరిలో 73 మందికి నెగిటివ్ రాగా ఒక వ్యక్తికి మాత్రం పాజిటివ్ వచ్చింది. దీంతో ఆ వ్యక్తిని మంగళవారం హుటాహుటిన ఏలూరు ఐసోలేషన్ వార్డుకు తరలించారు.
ఇదీ చదవండి: గుంటూరు జిల్లాలో ఆర్ఎంపీ వైద్యుడికి కరోనా పాజిటివ్