పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలంలో కరోనా వైరస్ విజృంభిస్తుంది. గడిచిన 24 గంటల్లో 26 మందికి పైగా కరోనా పాజిటివ్‌గా అధికారులు నిర్ధరణ చేశారు. వారిలో 14 మందిని ఏలూరుకు తరలిస్తుండగా లింగపాలెం అటవీ ప్రాంతానికి వెళ్లే సరికి ఓ వృద్ధుడు గుండె పోటుతో మృతి చెందారు. దీంతో బస్సును పక్కకు పెట్టి రోగులను రాత్రి 12 గంటల వరకు అక్కడే ఉంచారు. తాగటానికి నీరు కూడా లేదని... మృతదేహాన్ని పక్కనే పెట్టుకుని గంటల పాటు ఇక్కడే ఉన్నామంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
పాజిటివ్ వచ్చిన వారిని అంబులెన్స్‌లో కాకుండా ప్రైవేటు వాహనంలో తరలించడం వల్ల వృద్ధుడు మృతి చెందారని వారు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా కరోనా పాజిటివ్ వచ్చిన వారిని తరలిస్తున్న వాహనంలో వైద్య సిబ్బంది ఎవరూ లేకపోవడం గమనార్హం. రాత్రి 12 సమయంలో అధికారులు అక్కడికి చేరుకుని వారిని ఏలూరు తరలించారు. వృద్ధుడి మృతదేహాన్ని అటవీ ప్రాంతంలో ఖననం చేశారు.
ఇదీ చదవండి:
ఆ ఐదు జిల్లాల్లో కరోనా విజృంభణ... రికార్డు స్థాయిలో కేసులు నమోదు