పశ్చిమగోదావరి జిల్లాలో సుమారు నాలుగు వేల ఎకరాల్లో కోకో పంట పండిస్తున్నారు. జిల్లాలోని ఉండ్రాజవరం, నిడదవోలు, పెరవలి, కొవ్వూరు, అత్తిలి, ఇరగవరం, తాడేపల్లిగూడెం, చాగల్లు, గోపాలపట్నం, ద్వారకాతిరుమల మండలాల్లో ఉద్యానవన పంటల్లో భాగంగా.. కోకో పండిస్తున్నారు. కొన్నిచోట్ల కొబ్బరి తోటలో అంతర పంటగా పండిస్తున్నారు. పెట్టుబడులు పెరగడంతో గిట్టుబాటు కావడం లేదని రైతులు చెబుతున్నారు.
2, 3 సంవత్సరాల కిందటి వరకు కోకో సాగు లాభదాయకంగా ఉండడంతో రైతులు ఈ పంట వైపు మొగ్గుచూపారు.దీంతో విస్తీర్ణం పెరిగింది. క్యాడ్బరీ వంటి చాక్లెట్ తయారీ కంపెనీలు కోకో కొనుగోలు చేస్తున్నాయి. విస్తీర్ణం పెరగడంతో అవసరానికి తగిన స్థాయిలో గింజలు లభించడంతో కంపెనీలు రేట్లు పెంచడం లేదని రైతులు అంటున్నారు. కూలీల రేట్లు పెరగడం, ఎరువుల ధరలు అధికంగా ఉండటం, తదితర కారణాలు గిట్టుబాటు కాకుండా చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏడాదిగా కోకో గింజల ధరలు పెద్దగా మారలేదని, పెట్టుబడులు మాత్రం భారీగా పెరిగాయని రైతులు చెబుతున్నారు. ఎకరానికి పది నుంచి పదిహేను వేల రూపాయలు పెట్టుబడి అయ్యే సమయంలో కోకో గింజల ధర 160 నుంచి 165 రూపాయలు ఉండేదని.... ప్రస్తుతం పెట్టబడులు 50 నుంచి 55 వేల రూపాయలు అవుతుంటే కోకో గింజల ధర నామమాత్రంగా పెరిగి 185 రూపాయలకు చేరిందని రైతులు వాపోతున్నారు.
ఇదీ చదవండి