పశ్చిమ మన్యంవాసులకు అత్యాధునిక వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి. బుట్టాయగూడెంలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఆసుపత్రి భవన నిర్మాణం, సదుపాయాల కల్పనకు రూ.49.26 కోట్లు మంజూరు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఆసుపత్రి భవన సముదాయ నిర్మాణానికి అల్లికాలువ సమీపంలో 10 ఎకరాల ప్రభుత్వ భూమిని సేకరించారు. 164 పడకలతో ఈ ఆసుపత్రిని నిర్మిస్తున్నారు. ప్రధానంగా చిన్నపిల్లలు, మహిళలు, గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు తదితర వ్యాధుల వైద్య నిపుణులు, శస్త్రచికిత్సల వైద్య నిపుణులు అందుబాటులోకి రానున్నారు. అత్యాధునిక వైద్య సదుపాయాలు, పరికరాలను అందుబాటులో ఉండనున్నాయి.

శుక్రవారం అమరావతి నుంచి ముఖ్యమంత్రి శంకుస్థాపన
మల్టీస్పెషాలిటీ ఆసుపత్రుల భవనాల నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అమరావతి నుంచి శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారని ఎమ్మెల్యే తెల్లం బాలరాజు తెలిపారు. గిరిజనులకు ఉన్నత వైద్యాన్ని అందించేందుకు ఈ ఆసుపత్రులు ఎంతో ఉపయుక్తం అవుతాయన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో జగన్ ఇచ్చిన హామీ మేరకు వీటిని మంజూరు చేశారన్నారు.

బుట్టాయగూడెంతో పాటు సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరం, డోర్నాలలో ఈ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు ప్రభుత్వం రూ.246.30 కోట్లు మంజూరు చేసింది.
ఇవీ చదవండి: ఎర్రకాలువ గేట్లకు మరమ్మత్తుల మోక్షం ఎప్పుడో..!