సామాజిక ఐక్యత ఆవశ్యకతను, గొప్పతనాన్ని చాటిచెప్పిన గొప్ప సంస్కర్త అల్లూరి సీతారామరాజు అని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అభివర్ణించారు. భావాలపరంగా ఎన్నటికీ మరణం లేని విప్లవవీరుడాయన అని కొనియాడారు. స్వతంత్రం కోసం ప్రాణాల్ని పణంగా పెట్టిన ఎంతో మంది త్యాగధనులు, పోరాట యోధుల్లో అల్లూరి ఒక మహా అగ్నికణమన్నారు. భీమవరం సభలో సోమవారం ముఖ్యమంత్రి ప్రసంగించారు. ‘తెలుగుజాతికి, భారత దేశానికి గొప్ప స్ఫూర్తి ప్రదాత అల్లూరి సీతారామరాజు. అడవి బిడ్డలకు ఆరాధ్య దైవం. ఆయన వ్యక్తిత్వానికి, గొప్పతనానికి, త్యాగానికి నివాళులర్పిస్తున్నాం. ఆ మహనీయుడి ఘనతను గుండెల్లో పెట్టుకున్నాం కాబట్టే.. ఆయన నడయాడిన నేల, నేలకొరిగిన ప్రదేశం ఉన్న గడ్డకు అల్లూరి సీతారామరాజు జిల్లా అని పేరు పెట్టాం. అక్కడా ఆయన కాంస్య విగ్రహావిష్కరణ జరుగుతోంది. అడవిలోనూ అగ్గి పుట్టించిన ఆ యోధుడు తరతరాలకు సందేశమిచ్చేలా బతికారు. చిన్న వయసులోనే ప్రాణత్యాగం చేసిన ఆ మహా మనిషిని తెలుగుజాతి ఎప్పటికీ మరిచిపోదు. దేశం, అడవి బిడ్డల కోసం తనను తాను అర్పించుకున్న ఆ మహావీరుడికి వందనం. సీతారామరాజు ఎప్పటికీ చరితార్ధుడే. ఆయన త్యాగం ప్రతి ఒక్కరి గుండెల్లో చిరకాలం నిలిచిపోతుంది’ అని జగన్ కొనియాడారు.
దోపిడీకి వీల్లేని సమాజం కోసం కలలుగన్నారు..
‘ఒక దేశాన్ని మరో దేశం, ఒక జాతిని మరో జాతి, ఒక మనిషిని మరో మనిషి దోపిడీ చేయటానికి వీల్లేని సమాజాన్ని నిర్మించాలని స్వతంత్ర సమరయోధులందరూ కలలు కన్నారు. వారిని స్మరించుకుంటూ.. స్వతంత్రం సాధించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని స్వాతంత్య్ర అమృత మహోత్సవాలు నిర్వహిస్తున్నాం. మనల్ని మనం పాలించుకోవటం ప్రారంభమై ఇప్పటికే 75 సంవత్సరాలు అవుతోంది. మన పూర్వీకులు, స్వతంత్ర సమరయోధులు వారి భవిష్యత్తు, జీవితం, రక్తం ధారపోసి మన దేశానికి స్వాతంత్య్రం తెచ్చారు. అది అమృతంతో సమానం. మన జాతీయోద్యమంలో 1757 నుంచి 1947 సంవత్సరం వరకూ దాదాపు 190 సంవత్సరాలు పరాయి పాలనపై మన దేశం యుద్ధం చేస్తూనే అడుగులు ముందుకు వేసింది. స్వాతంత్య్రం కోసం లక్షల మంది వారి ప్రాణాల్ని పణంగా పెట్టారు. అలాంటి మహా త్యాగమూర్తుల్లో మన గడ్డపైన, మన మట్టి నుంచి, మన ప్రజల్లో నుంచి అనేక అగ్నికణాలు పుట్టాయి. వారు ఎంచుకున్న మార్గాలు వేరైనా లక్ష్యం ఒక్కటే’ అని సీఎం పేర్కొన్నారు. ప్రసంగం చివర్లో అమర్ రహే అల్లూరి సీతారామరాజు అంటూ జగన్ నినాదాలు చేశారు.
ఇవీ చదవండి: