పోలవరం ప్రాజెక్టు పరిశీలన అనంతరం ముఖ్యమంత్రి జగన్ అధికారులు, ఇంజినీర్లు, కాంట్రాక్టు సంస్థలు, స్థానిక ప్రజా ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. పోలవరం అత్యంత ప్రాధాన్యమైనదిగా పేర్కొన్న సీఎం.. 2021 జూన్ నాటికి పోలవరం పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ మేరకు కార్యాచరణ ప్రణాళికపై అధికారులతో చర్చించారు. ఈ ప్రాజెక్టును సకాలంలో అందుబాటులోకి తెస్తేనే ప్రయోజనం ఉంటుందని అన్నారు. గతంలో ప్రణాళిక, సమన్వయ, సమాచార లోపాలుండేవన్న సీఎం.. ప్రాజెక్టు పనులకు కలిగే అడ్డంకులపై దృష్టి పెట్టాలన్నారు. ఈ జూన్‌లోగా స్పిల్‌వే, అప్రోచ్ ఛానల్ పనులు పూర్తి కావాలని నిర్దేశించారు.
సత్వర అనుమతుల కోసం దిల్లీలో అధికారి
ప్రాజెక్టు పనుల ఫాలో అప్, సత్వర అనుమతుల కోసం దిల్లీలో అధికారిని ఉంచాలని సీఎం అధికారులకు సూచించారు. డ్రాయింగులు, డిజైన్ల అనుమతి, లైజనింగ్‌కు అధికారిని కేటాయించాలన్న ఆయన.. కుడి, ఎడమ కాల్వలను నిర్దేశిత సమయానికి వినియోగంలోకి తేవాలని అన్నారు. రెండు వైపులా టన్నెల్ తవ్వకం పనుల ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. జూన్ నాటికి కుడి ప్రధాన కాల్వ కనెక్టివిటీ పూర్తవుతుందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఎడమ కాల్వ కనెక్టివిటీకి 2 ప్యాకేజీల్లో పనులు జరుగుతున్నాయని తెలిపారు.
స్పిల్‌వే ముందు బ్రిడ్జి నిర్మాణంపైనా చర్చ
పోలవరం ప్రాజెక్టులో స్పిల్‌వే ముందు నిర్మించాల్సిన బ్రిడ్జిపైనా సీఎం అధికారులతో సమీక్షించారు. ఈ బ్రిడ్జిని ఎర్త్ కం రాక్‌ఫిల్ డ్యాంతో అనుసంధానించేలా డిజైన్ చేస్తున్నామని.. తద్వారా 4 వరుసల రహదారి ఏర్పడుతుందని ముఖ్యమంత్రికి అధికారులు వెల్లడించారు. డిజైన్ ఖరారు చేసి పనుల విషయంలో ముందుకు వెళ్లాలని సీఎం అధికారులకు సూచించారు.
సహాయ పునరావాసాలపై సమీక్ష
పోలవరం ముంపు ప్రాంతాల్లో సహాయ పునరావాస కార్యక్రమాలపైనా సీఎం సమీక్షించారు. కాపర్‌డ్యాం ఖాళీలు పూర్తిచేస్తే 41.15 మీటర్ల నీరు నిల్వ ఉంటుందని.. వెను వెంటనే 17 వేలకుపైగా కుటుంబాలను తరలించాల్సి ఉంటుందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఆ మేరకు సహాయ పునరావాస పనులపై ముందుకెళ్లాలని జగన్ అధికారులను ఆదేశించారు. సత్వర పనులకు కావాల్సిన నిధులు అందుబాటులో ఉంచుతామన్న ఆయన.. పునరావాస కాలనీల పనులకు అవసరమైన నిధులు విడుదల చేస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: