సీఎం జగన్ మోహన్ రెడ్డి బెదిరింపుల వల్లే తెదేపా నాయకులు వైకాపాలో చేరుతున్నారని పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ విమర్శించారు. లొంగని వారిపై కేసుల పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. నియంతకి అధికారం వస్తే ఏ విధంగా ఉంటుందో జగన్ను చూస్తే తెలుస్తోందన్నారు. ఏలూరు జిల్లా కారాగారం నుంచి బెయిల్పై విడుదలైన ఆయన...వైకాపా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
సొంత చిన్నాన్న హత్యకేసులో నిందితులను ఇంత వరకు అరెస్టు చేయని జగన్ తమపై మాత్రం కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. నియంతలా మారి పోలీస్, రెవెన్యూ యంత్రాంగాలను అడ్డం పెట్టుకొని ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. కక్షసాధింపుతోనే అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డిలను అరెస్టు చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆరోపించారు.