Chandrababu Naidu Rythu Poru Bata Padayatra: అకాల వర్షాలకు దెబ్బతిన్న రైతుల తరఫున ప్రభుత్వంపై పోరుబాటకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు సిద్ధమయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో శుక్రవారం రైతులతో కలిసి భారీ నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. రైతు పోరుబాట పేరిట అన్నదాతలతో కలిసి తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఇరగవరం నుంచి తణుకు వరకు 12కిలోమీటర్లు మేర పాదయాత్ర చేయనున్నారు. శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పలు గ్రామాల మీదుగా పాదయాత్ర సాగనుంది. ప్రభుత్వ వైఫల్యంపై నిరసనగా భారీ స్థాయిలో రైతు పోరుబాట కార్యక్రమ నిర్వహించనున్నారు.
వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం ఇవ్వకపోవడం, దెబ్బతిన్న ధాన్యం కొనుగోలు చేయకపోవడంపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఈ పోరుబాట కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టనున్నారు. అకాల వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఎకరాల్లో వాణిజ్య, ఉద్యాన, ఆహార పంటలకు నష్టం వాటిల్లినట్లు టీడీపీ వర్గాలు అంచనా వేసాయి. ఈ నెల 4, 5, 6 తేదీల్లో క్షేత్ర స్థాయి పర్యటన ద్వారా పంట నష్ట ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు, అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలంటూ చేసిన డిమాండ్‌పై ప్రభుత్వం స్పందించకపోవడంతో చంద్రబాబు పోరుబాటకు పిలుపునిచ్చారు.
బాబుతో గన్నవరం నేతలు భేటీ: గన్నవరంలో వైసీపీ అక్రమ కేసుల్లో బాధితులైన టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఈ రోజు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో సమావేశం అయ్యారు. ఫిబ్రవరి 20వ తేదీన వైసీపీకి చెందిన కొందరు గన్నవరం టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశాయి. కార్యాలయంలో ఉన్న కార్లు, ఇతర వాహనాలను తగులబెట్టారు. కార్యకర్తలపై దాడులు చేశారు. అయితే నాటి దాడులకు పాల్పడిన వైసీపీ గూండాలపై చర్యలు తీసుకోకుండా... బాధితులైన టీడీపీ కార్యకర్తలపై పోలీసులు కఠిన సెక్షన్లతో కేసులు పెట్టారు. స్థానిక సీఐతో పాటు వైసీపీ కార్యకర్తల ఫిర్యాదుల ఆధారంగా 27 మంది తెదేపా కార్యకర్తలు, నాయకులపై అక్రమ కేసులు పెట్టారు. హత్యాయత్నం, అట్రాసిటీ వంటి సెక్షన్లు జోడించి 13 మందిని జైలుకు పంపారు. కోర్టుకు వెళ్లడం ద్వారా మరో 14 మంది ముందస్తు బెయిల్ పొందారు.
పార్టీ అధినేతతో భేటీ అయిన వీరంతా... నాటి కేసులు, పోలీసులు, వైసీపీ నేతల వేధింపులు, బెదిరింపులను వివరించారు. అరెస్ట్ సమయంలో కొందరు పోలీసులు వ్యవహరించిన తీరును ప్రత్యేకంగా అధినేత దృష్టికి తెచ్చారు. అక్రమ కేసుల విషయంలో పార్టీ అండగా ఉంటుందని.. కార్యకర్తలు, నాయకులు ధైర్యంగా ఉండాలని చంద్రబాబు వారికి సూచించారు. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, పార్టీ అన్నిటికీ సమాధానం ఇస్తుందని నేతలకు చంద్రబాబు భరోసా ఇచ్చారు. ధైర్యంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలని వారికి చంద్రబాబు సూచించారు.
ఇవీ చదవండి: