పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు వద్ద వలస కార్మికులు, పోలీసుల మధ్య గొడవపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. గత 3 రోజుల నుంచి 300 మంది వలసదారులు సహాయం కోరుతున్నా ఎవరూ పట్టించుకోలేదని ఆరోపించారు. సీఎం జగన్ వారి దుస్థితిని పరిగణనలోకి తీసుకుని తక్షణ సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. గొడవకు సంబంధించిన వీడియోను చంద్రబాబు తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
సుమారు 300 పైగా బిహార్, ఝార్ఖండ్, ఛత్తీస్గఢ్ ప్రాంతాలకు చెందిన వలస కూలీలు గోదావరి నదిలో ఇసుక కార్మికులుగా పనిచేస్తున్నారు. తమ రాష్ట్రాలకు పంపాలని నిన్న కొవ్వూరు ప్రధాన రహదారిపై ఆందోళన చేపట్టారు. ఆయా రాష్ట్రాల నుంచి అనుమతులు లేవని, అనుమతులు వచ్చాక పంపుతామని పోలీసులు రెవెన్యూ అధికారులు సర్దిచెప్పడానికి ప్రయత్నించారు. అయితే ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడడంతో సహనం కోల్పోయిన వలస కూలీలు పోలీసులపై దాడికి దిగారు. వలస కూలీలపై పోలీసులు సైతం లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. ఆయా రాష్ట్రాల నుంచి ఎలాంటి వాహన సౌకర్యం అనుమతులు రాకపోవడంతో అధికారులు వారిని స్వస్థలాలకు పంపించే ఏర్పాటు చేయలేదు. నడిచి వెళతామని కూలీలు పట్టుపట్టడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.
ఇదీ చదవండి...కొవ్వూరులో.. పోలీసులపై వలసకూలీల రాళ్ల దాడి