పశ్చిమగోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల చిన్న వెంకన్న దేవస్థానం కొండపైకి ప్రైవేటు వాహన ప్రవేశించటం చర్చనీయాశమైంది. అందులోనూ పాత నేరస్థుడు వాహనంలో కొండపైకి వెళ్లటం వివాదాస్పదమైంది. లాక్డౌన్ నిబంధనలు మేరకు దేవస్థానం ఉద్యోగుల వాహనాలు తప్ప ఇతర వాహనాలు కొండపైకి వెళ్లకూడదు. అయితే ఈ నిబంధనలకు విరుద్ధంగా దేవస్థానం టోల్గేట్ వద్ద ఉన్న భద్రతా సిబ్బంది ఈ నెల 2వ తేదీ రాత్రి పదిన్నర గంటల సమయంలో కారు కొండపైకి వెళ్లేందుకు అనుమతించారు. ఇది సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైంది.
ఈ కారు కొండపైన ఉన్న దేవస్థానం అతిథిగృహం వద్దకు వెళ్లింది. కొంతమంది అక్కడ విందు చేసుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయం పుణ్యక్షేత్రంలో చర్చనీయాంశమైంది. సీసీ కెమెరాలు ఫుటేజీలను పరిశీలించిన ఆలయ ఈవో ఆర్. ప్రభాకర్ రావు దీనిపై విచారణ చేపట్టారు. నిబంధనలు పాటించకుండా కారును అనుమతించిన భద్రతా సిబ్బంది ముగ్గురికి నోటీసులు జారీ చేశారు. పూర్తిస్థాయిలో విచారణ చేసి తగు చర్యలు తీసుకుంటామని ఈవో తెలిపారు.