ఇసుక రవాణాపై నిషేధం, నూతన ఇసుక విధానం అమల్లోకి వచ్చాక ఏర్పడిన ఇసుక కొరతతో... పశ్చిమ గోదావరి జిల్లాలో అనేక నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయి. అప్పటి వరకు అడపాదడపా పనులతో... కుటుంబాన్ని నెట్టుకొస్తున్న భవన నిర్మాణ కార్మికులను కరోనా మరిన్ని కష్టాల్లోకి నెట్టింది. లాక్డౌన్ సడలింపులు జరిగినా... కేసుల సంఖ్య పెరగడంతో నిర్మాణ పనులన్ని పూర్తి స్థాయిలో నిలిచిపోయాయి. దీంతో ఉపాధి కరువైన కూలీలు... పూటగడవని స్థితిలో కష్టాలను అనుభవిస్తున్నారు. ఇంటి అద్దెలు కట్టలేక, కుటుంబ పోషణ భారమై... పస్తులతో కాలాన్ని వెళ్లదీస్తున్నారు.
ప్రత్యక్షంగా సుమారు 33 రంగాలకు చెందిన కార్మికులు... పరోక్షంగా 20 రంగాలకు చెందిన కూలీలు ఉపాధి పొందుతున్నారు. తాపీ మేస్త్రీలు, ప్లంబర్లు, సెంట్రింగ్ పనివారు, ఫ్లోరింగ్, పెయింటర్ల వంటి అనేక మంది ఉన్నారు. నిర్మాణ రంగం కుదేలుతో వీధిన పడ్డారు. పశ్చిమ గోదావరిజిల్లాలో ప్రత్యక్షంగా 78 వేల కుటుంబాలు నిర్మాణరంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. పరోక్షంగా 1.20లక్షల మంది కూలీలు, కార్మికులు దీనిపైనే ఉపాధి పొందుతున్నారు.
పనుల్లేక కొంతమంది స్వగ్రామాల బాటపట్టగా... మరికొంతమంది ఉపాధి కోసం ఎదురుచూస్తున్నారు. ఇల్లు గడవక దిక్కుతోచని స్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు. భవన నిర్మాణ కార్మికుల కష్టాలు గుర్తించి.. ప్రభుత్వం సహాయం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చదవండి: