పశ్చిమ గోదావరి జిల్లాలో నకిలీ ఆస్తి పత్రాలతో బ్యాంకులను కేటుగాళ్లు మోసగిస్తున్నారు. కోట్ల రూపాయలు రుణాలు పొంది తిరిగి కట్టకుండా బ్యాంకు అధికారులకు చుక్కలు చూపిస్తున్నారు. ఆక్వా రంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం.. ఇలా పక్కదారి పడుతోంది. వైట్ కాలర్ నేరాలకు కారణమవుతోంది. జిల్లాలోని డెల్టా ప్రాంతంలో అధికంగా ఇలాంటి మోసాలు వెలుగుచూస్తున్నాయి. ఈ అక్రమ రుణాల వ్యవహారంలో రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులూ ఉన్నారు. వీరికి ఆక్వా చెరువులు, వ్యాపారాలు ఉన్నాయి. వాటిపై రుణాలు తీసుకుని తిరిగి చెల్లించట్లేదు. తాజాగా భీమవరంలో నకిలీ ఆస్తి పత్రాలు తాకట్టు పెట్టి రెండు బ్యాంకులకు 370 కోట్ల రూపాయలు కుచ్చుటోపీ పెట్టారు.
ఎందుకిలా జరుగుతోంది!
మామూలు వ్యాపారికి లేదా రైతుకు రుణం ఇవ్వాలంటేనే ఎంతో జాగ్రత్తగా పత్రాలన్నీ తనిఖీ చేస్తారు. అలాంటిది కోట్ల రూపాయలు అప్పు ఇచ్చేటప్పుడు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి? ఈ విషయంలోనే బ్యాంకు అధికారులు విఫలమవుతున్నారు. పత్రాల తనిఖీలో ఉదాసీనంగా ఉంటున్నారనీ.. అందుకే ఇలాంటి మోసాలు జరుగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు.
రంగంలోకి సీబీఐ
బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు సీబీఐ అధికారులు రంగంలోకి దిగి తాజా ఉదంతంపై దర్యాప్తు చేస్తున్నారు. ఆ బ్యాంకుల్లో రహస్యంగా విచారణ మొదలుపెట్టారు. అప్పులు తీసుకున్న వారి వివరాలు, ఆస్తి పత్రాలు సేకరిస్తున్నారు. దీంతో.. అక్రమంగా రుణం పొందిన వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారో అని వణికిపోతున్నారు. కొందరైతే అప్పుడే పైరవీలు చేయడం మొదలుపెట్టారు.
ఇదీ చదవండి... గోదావరి వరద.. పంటలకు తీవ్ర నష్టం