పశ్చిమ గోదావరి ఏలూరులో లాడ్జిలో ఓ పీజీ వైద్య విద్యార్థి కరోనాతో మృతి చెందాడు. మృతుడు స్థానిక అశ్రం వైద్య కళాశాలలో పీజీ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. నాలుగు రోజులుగా ఏలూరులోని ఆదిత్య లాడ్జిలో గది తీసుకుని ఉంటున్నాడు. మూడు రోజులుగా బయటికి రాకపోవడంతో లాడ్జి సిబ్బంది గది పరిశీలించారు. విద్యార్థి మృతి చెంది ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు. మొదట పోలీసులు ఆత్మహత్యగా అనుమానించారు. మృతుడి గదిలో యాంటిబయాటిక్ మందులు లభ్యమవ్వటంతో వేరే కోణంలో విచారణ చేపట్టారు. మృతదేహం నుంచి నమూనాలు సేకరించి పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
కొవిడ్ నేపథ్యంలో అశ్రం వైద్య కళాశాల తరగతులు నిలిపివేశారు. విజయవాడలోని ప్రైవేటు ఆసుపత్రిలో విద్యార్థి పని చేసినట్లు సమాచారం. అక్కడే వైరస్ సోకినట్లు అనుమానం రావటంతో హోమ్ క్వారంటైన్లో ఉండేందుకు ఏలూరులోని హోటల్ రూమ్ తీసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే తీవ్ర అనారోగ్యానికి గురై మృతి చెంది ఉంటాడని అనుమానిస్తున్నారు. విశాఖలో ఉంటున్న విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చూడండి..