పశ్చిమగోదావరి జిల్లాలో నాలుగో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం ఆరున్నర నుంచి.. ఏలూరు రెవెన్యూ డివినిజన్ పరిధిలో ఎన్నికలు జరగనున్నాయి. 12 మండలాల పరిధిలోని 266 గ్రామ పంచాయతీ, 2,800 వార్డు స్థానాలకు ఎన్నికల ప్రకటన విడుదలైంది. అందులో 29 సర్పంచ్, 639 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యయి. మొత్తం 606 మంది సర్పంచ్, 4165 మంది వార్డు స్థానాల అభ్యర్థులు బరిలో ఉన్నారు. నాలుగో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 6 లక్షల 10 వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఎన్నికల నిర్వహణకు 2,593 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. అందుకోసం 13,593 మంది సిబ్బందిని నియమించారు. రెండు వేల మంది పోలీసులు బందోబస్తు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే 574 సమస్యాత్మక, 431అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో నిరంతరం వెబ్ కాస్టింగ్, కెమెరా రికార్డింగ్ ఉండేలా పోలీసులు చర్యలు చేపట్టారు. కొవిడ్ నిబంధల్లో భాగంగా సిబ్బందికి శానిటైజర్లు, మాస్కులను అధికారులు అందించారు. ఇప్పటికే సిబ్బంది ఎన్నికల సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. నాలుగో దశ ఓట్ల లెక్కింపులో ఆలస్యం జరగకుండా అధికారులు చర్యలు చేపట్టారు.