పశ్చిమగోదావరి జిల్లాలో 252 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు ఉన్నాయి. వీటన్నిటికీ గతంలో నియమించిన త్రిసభ్య కమిటీల పదవీకాలం పూర్తైంది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పీఏసీఎస్‌లకు త్రిసభ్య కమిటీలను నియమించింది. వాస్తవానికి సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా... కొవిడ్, తదితర కారణాల వల్ల ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో మరోసారి కమిటీలను నియమించడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలోనే ఎన్నికలు జరగాల్సి ఉండగా సార్వత్రిక ఎన్నికలు, తదితర కారణాలతో ఎన్నికలు నిర్వహించలేదు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాలకవర్గాల స్థానే ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీలను నియమించింది. ఆర్నెళ్ల పదవీ కాలానికి నియమించిన కమిటీలు మూడు పర్యాయాలు బాధ్యతలు నిర్వర్తించాయి. నాలుగు నెలల క్రితమే కాలపరిమితి పూర్తవడంతో తాజాగా కొత్త కమిటీలను నియమిస్తున్నారు. జిల్లాలో 90 సహకార సంఘాలకు పాత కంపెనీ కొనసాగించాలని నిర్ణయించడంతో వీరంతా ఇప్పటికే బాధ్యతలు స్వీకరించారు. మిగిలిన 162 సంఘాలకు ఛైర్మన్లు, సభ్యుల మార్పులకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించామని జిల్లా సహకార అధికారి మురళీకృష్ణ వివరించారు. ప్రభుత్వం నుంచి ఆమోదం రాగానే సంబంధిత కమిటీలను అధికారికంగా ప్రకటిస్తామని ఆయన తెలిపారు.
ఇదీ చదవండి: పేదవాడికి ఉపయోగపడని ప్రభుత్వాలు.. ఫెయిల్ అయినట్లే: సీఎం