Aqua Farmers Shifting From Shrimp Farming to Fish Farming: ఆక్వా సాగులో అధిక దిగుబడులు సాధిస్తూ.. ఎగుమతుల్లో మొదటి స్థానంలో ఉండే పశ్చిమ గోదావరి జిల్లా జిల్లా రైతులు.. ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. రొయ్యల దిగుబడులు వేసవిలో ఆశాజనంగా ఉంటాయని రైతులు భావిస్తుంటారు. అందుకు తగ్గట్టే ఈ సీజన్లో ఎక్కువ మంది రైతులు రొయ్యల సాగుకు ఉపక్రమిస్తుంటారు.అయితే ఈ ఏడాది సీజన్లో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. మే మొదటి వారంలో కురిసిన అకాల వర్షాలు .. రొయ్యల సాగుపై తీవ్ర ప్రభావం చూపాయి. పగలంతా మండే ఎండలు వేధిస్తున్న ఉక్కబోత మధ్యలో చెదురుమదురు వర్షాలతో.. చెరవుల్లో ఆక్సిజన్ స్థాయిలు పడిపోతున్నాయి. జోన్ల పేరుతో విద్యుత్ సబ్సిడీని ప్రభుత్వం తొలగించడం అక్వా రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది.
గతంలో ఎకరా రొయ్యల చెరువు సాగు చేస్తే 4 నుంచి 5 వేల రూపాయల విద్యుత్ బిల్లులు చెల్లించగా ఇప్పుడది 10 వేల నుంచి 13 వేల రూపాయలకు పెరిగింది. మరోవైపు మేత ధరలు సగటున కిలోకు 27 రూపాయలకు పైగా పెరిగాయి. రొయ్యల కొనుగోళ్ల విషయానికి వచ్చే సరికి వ్యాపారులు సిండికేట్గా మారి 100 నుంచి 80 కౌంట్ రొయ్యలను కిలోకు రూ.15 - 25 వరకు తగ్గించినట్లు తెలుస్తోంది.
ప్రత్యక్షంగా, పరోక్షంగా కొన్ని లక్షల మందికి ఉపాధిని చూపుతోన్న ఆక్వా రంగం ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. రోజు రోజుకు పెరుగుతున్న పెట్టుబడులకు తోడు.. అమాంతం పడిపోతున్న రొయ్యల ధరలు పడిపోతున్నాయి. దీని కారణంగా ఆక్వా రైతులు ఎన్నడూ లేనంతగా సంక్షోభాన్ని చవిచూస్తున్నారు. వైరస్ల నుంచి కాస్తో కూస్తో ఉపశమనం పొందుతున్న తరుణంలో ధరలు పాతాళానికి పడిపోవడం రొయ్య రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. లక్షలకు లక్షలు పెట్టుబడులు పెట్టలేక పెట్టినా అవి తిరిగివచ్చే పరిస్థితి లేక రైతులు రొయ్యల సాగంటేనే వెనకడుగు వేస్తున్నారు.
"రొయ్యల సాగు చేపట్టాను. పెరిగిన కరెంటు ధరల వల్ల.. రొయ్యల ధర తగ్గిపోవటం వల్ల నేను తీవ్రంగా నష్టపోయాను. దాని గురించి ఏం చేయాలో కూడా అర్థం కావటం లేదు. మళ్లీ పెట్టుబడులు పెట్టే పరిస్థితిలో లేను. అప్పుల పాలయ్యాను." - ఆక్వా రైతు
"నేను పది ఎకరాల్లో రొయ్య సాగు చేపట్టాను. ఎకరానికి 50 వేల చొప్పున సాగు చేశాను. ఎందుకంటే ఆ 50వేల సాగు కూడా కష్టంగా మారింది. తర్వాత క్రాఫ్ హాలీడేకి వెళ్లిపోదామని అనుకుంటున్నాను. ప్రభుత్వాధికారులు రైతుల సమస్యలు అర్థం చేసుకోవాలి. గతంలో నాలుగు నెలల సాగులో 20 వేల రూపాయలు అయ్యేది. ఇప్పుడు మాత్రం 52 వేల రూపాయలు అవుతోంది." - ఆక్వా రైతు
గతంలో ఎకరాకు 80 వేల నుంచి లక్ష పిల్లల వరకు రొయ్యలు వేస్తుండగా రేపటి రోజున ధర ఎలా ఉంటుందో ఏమోనన్న ఆందోళనతో రైతులు భారీగా సాంద్రతను తగ్గించుకుంటున్నారు. ప్రస్తుతం ఎకరాకు 40 నుంచి 50 వేల పిల్లలను మాత్రమే వదులుతున్నారు. ఏళ్ల తరబడి రొయ్యల చెరువులు సాగు చేస్తున్నా అనుభవం.. ప్రస్తుతం ధరల వల్ల దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. కొంత మంది రైతులు సాగును పూర్తిగా వదులుకోలేక చేపలు పెంచితేనైనా నష్టాల నుంచి బయటపడవచ్చని భావిస్తున్నారు. కనీసం చేపల సాగు ద్వారానైనా లీజు డబ్బులైనా సంపాదించుకోవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి.. రొయ్య రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు.. విద్యుత్ రాయితీ కల్పించడం, విపరీతంగా పెరిగిన మేతల ధరలను అదుపులోకి తీసుకురావాలని ఆక్వా రైతులు కోరుతున్నారు.