Returnable Plots Registration in Amaravati : రాజధాని అమరావతి నిర్మాణ పనులను తిరిగి ప్రారంభిస్తున్న తరుణంలో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకూడదని ప్రభుత్వం భావిస్తోంది. రాజధానికి భూములిచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్లను వీలైనంత త్వరగా అప్పగించాలని నిర్ణయించింది. తమ తమ రిటర్న్‌బుల్ ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటూ అధికారులు అన్నదాతలకు లేఖలు పంపుతున్నారు. ఈ మేరకు ప్రత్యేకంగా ఆహ్వాన పత్రికలు కూడా ముద్రించారు.
రైతులకు నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ రిజిస్ట్రేషన్లకు ఆహ్వానిస్తున్నారు. అమరావతి నిర్మాణాన్ని శరవేగంగా పూర్తిచేయడానికి సహకారం అందించాలని అధికారులు కోరుతున్నారు. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన అన్నదాతలకు అప్పటి టీడీపీ ప్రభుత్వం నివాస, వాణిజ్య ప్లాట్లు కేటాయించింది. కొందరు రిజిస్ట్రేషన్ చేయించుకోగా వివిధ కారణాలతో మరికొందరు చేయించుకోలేకపోయారు. వైఎస్సార్సీపీ హయాంలో అమరావతినే పక్కనపెట్టేయడంతో రిజిస్ట్రేషన్లు కర్షకులు చేయించుకోలేకపోయారు.
"చాలా మంది రైతులు రాజధానికి భూములు ఇచ్చారు. రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలంటూ ఆహ్వాన పత్రికలు అందించాం. రిజిస్ట్రేషన్ల కోసం మెగా డ్రైవ్ చేపట్టాం. ఒరిజినల్ ధృవపత్రాలు తీసుకువస్తే మీ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసి మీకు డాక్యుమెంట్ అందజేస్తాం. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం." - పద్మావతి, అనంతవరం సీఆర్డీఏ అధీకృత అధికారి
జగన్ పాలనలో రిజిస్ట్రేషన్ల కోసం తీసుకొచ్చిన కార్డు 2.0 విధానంతో రైతుల సమస్యలు మరింత రెట్టింపయ్యాయి. భూమికి సంబంధించిన పత్రాలు, అసలు డాక్యుమెంట్ ఉండాలన్న షరతులతో అన్నదాతలను గత ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది. కర్షకులు భూములను సమీకరణలో ఇవ్వడంతో రెవెన్యూ ఆఫీస్‌ల్లో వాటికి సంబంధించిన రికార్డులను అప్‌గ్రేడ్ చేయలేదు. దీంతో డిజిటల్ సంతకాలు, సాంకేతిక సమస్యలు తలెత్తాయి. వీటిని తప్పనిసరిగా రెవెన్యూ ఆఫీసుల్లో సరిచేసుకోవాల్సిన పరిస్థితి రాజధాని కర్షకులకు ఏర్పడింది. ఈ క్రమంలో ఇటు సీఆర్డీఏ కార్యాలయాలు, అటు తహసీల్దార్ల కార్యాలయాల చుట్టూ తిరగలేక అన్నదాతలు ఇబ్బందులు పడ్డారు.
Amaravati Farmers Plots Registration : కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ల ప్రక్రియను సరళతరం చేసింది. ఇటీవలి కాలంలోనే దాదాపు 3000ల ప్లాట్ల రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. తాజాగా రాజధాని పరిధిలోని 9 గ్రామాలకు సంబంధించి సీఆర్డీఏ కార్యాలయాల్లోనే రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఆ మేరకు సిబ్బందిని నియమించారు. అనంతవరం సీఆర్డీఏ అధీకృత అధికారులు కాస్త చొరవ తీసుకుని ఆహ్వాన పత్రికలు పంపడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొత్త ఏడాదిలో రాజధాని పనులు తిరిగి ప్రారంభం కానున్న తరుణంలో రాబోయే వంద రోజుల్లో అన్నదాతల ప్లాట్ల రిజిస్ట్రేషన్లు పూర్తిచేయాలని సీఆర్డీఏ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.
రాజధాని నిర్మాణంలో యువతను భాగస్వామ్యం చేయడంపై ప్రభుత్వం ఫోకస్