పోలవరం ప్రాజెక్టును ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి 9 లక్షల 47వేల 161 మంది సందర్శించారని ప్రాజెక్టు వద్ద నమోదైన గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకూ అన్ని జిల్లాల నుంచి 17వేల 342 బస్సుల్లో సందర్శకులు ఈ ప్రాజెక్టును చూసేందుకు తరలివచ్చారు. స్పిల్ వే, ప్రాజెక్టు గేట్లు, కాఫర్ డ్యామ్ల నిర్మాణం, స్పిల్ ఛానల్, కాంక్రీటు పనులు, డయాఫ్రాం వాల్ ఇలా అన్ని నిర్మాణాలను జలవనరుల శాఖ అధికారులు సందర్శకులకు చూపిస్తున్నారు.
జలవనరుల శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. నియోజవర్గాల వారీగా స్థానిక శాసనసభ్యుల ద్వారా ఈ అవకాశాన్ని పొందే వీలుంది. ప్రాజెక్టును సందర్శించాలనుకున్న వారంతా బృందంగా వెళ్తే వారికి బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. సందర్శకుల సంఖ్య పది లక్షలకు చేరుతున్న తరుణంలో ఒక్క రోజే 700 బస్సులతో ప్రాజెక్టు చూసేందుకు జలవనరుల శాఖ ఏర్పాట్లు చేసింది. ఒకే రోజు 30 వేల మందికి పైగా ప్రజలు ప్రాజెక్టును చూడనున్నారు.