EX MP Harshakumar Fire on cm jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత హర్ష కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత చెల్లెలు, చిన్నాన్న కుమార్తెలకు న్యాయం చేయలేని.. ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలోని అక్క చెల్లమ్మలకు ఏం న్యాయం చేస్తాడని ప్రశ్నించారు. గతకొన్ని నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అక్క చెల్లమ్మలకు న్యాయం చేస్తున్నామంటూ జగన్ పదేపదే చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. వివేకాను ఎవరు హతమార్చారన్న అంశం అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు.
ఇద్దరు దళితుల్ని హత్య చేసినా న్యాయం జరగలేదు.. రాజమహేంద్రవరంలో మీడియాతో హర్ష కుమార్ మాట్లాడుతూ.. మహిళలకు అన్యాయం జరిగితే, పది నిమిషాల్లో అక్కడ ఉంటానన్న సీఎం జగన్.. వాస్తవంలోకి వచ్చేసరికి అలా జరగడం లేదని గుర్తు చేశారు. విశాఖ ఉక్కు గురించి తెలంగాణ మంత్రి కేటీఆర్ మాట్లాడిన తర్వాత జగన్ పాలన ఎలా ఉందో బాగా అర్థం చేసుకోవచ్చన్నారు. రాష్ట్రంలో దళితులపై దాడులు, హత్యలు పెరిగాయని విమర్శించారు. స్వయంగా హోం మంత్రి తానేటి వనిత నియోజకవర్గంలోనే ఇద్దరు దళితుల్ని హత్య చేసినా.. ఇప్పటికీ ఎటువంటి న్యాయం జరగలేదని హర్ష కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
మార్గదర్శి వల్ల అంతా మంచి జరిగింది.. మార్గదర్శి చిట్‌ఫండ్ వల్ల నష్టం జరిగిందని ఏ ఒక్కరి నుంచి ఇప్పటివరకూ ఎటువంటి ఫిర్యాదులు అందలేదని హర్ష కుమార్ తెలిపారు. అలాంటప్పుడు సంస్థ ఛైర్మన్ రామోజీరావును ఇంత పెద్ద వయస్సులో ముఖ్యమంత్రి జగన్ ఇబ్బంది పెట్టడం సరికాదని మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత హర్షకుమార్ అభిప్రాయపడ్డారు. మార్గదర్శి వల్ల అందరికీ మంచే జరిగిందని వ్యాఖ్యానించారు.
అలా చదవడం నేర్పిందే ఈనాడు.. ఈనాడు దినపత్రిక గురించి హర్ష కుమార్ పలు కీలక విషయాలను ప్రస్తావించారు. తెల్లవారుజామున ఐదు గంటలకే పత్రిక చదవడం అలవాటు చేసిందే ఈనాడు అని ఆయన అన్నారు. ప్రజల్లో న్యూస్ పేపర్ చదివేలా ఆసక్తిని కలిగించిందే ఈనాడు పత్రిక అని గుర్తు చేశారు. తనకు కూడా ఈనాడు చదవడం వల్లే జ్ఞానం పెరిగిందని చెప్పారు. సివిల్స్ పరీక్షల్లో కూడా ఈనాడు పత్రిక చదివితే అన్ని అంశాలు కవర్ అవుతాయన్న హర్ష కుమార్.. ఇంత కర్కశంగా రామోజీరావుపై పగ తీర్చుకోవడం సరికాదని అసహనం వ్యక్తం చేశారు. తాను ఏం నేరం చేశానని జగన్ ప్రభుత్వం 48 రోజులపాటు జైల్లో పెట్టారని హర్ష కుమార్ ప్రశ్నించారు.
తప్పని తేలితే ఎవరిని శిక్షించాలి..?.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మార్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థలపై ఏపీ సీఐడీ పోలీసులు చేస్తున్న దాడులపై మరోసారి వైఎస్సార్సీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఘాటుగా స్పందించారు. అధికారం ఉంది కదా అని.. 60 ఏళ్లుగా సంపాదించుకున్న విశ్వసనీయతను హననం చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. దేశ రెండో అత్యున్నత పురస్కారం అందుకున్న రామోజీరావు లాంటి వ్యక్తిని వేధించడాన్ని చూడలేకే తాను మాట్లాడుతున్నానని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలన్నీ రేపటి రోజున తప్పని తేలితే ఎవరిని శిక్షించాలని రఘురామకృష్ణ రాజు ప్రశ్నించారు.
ఇవీ చదవండి