రాష్ట్రంలోనే కరోనా పాజిటివ్ కేసులు అత్యధికంగా కర్నూలు జిల్లాలో నమోదు కావటంతో జిల్లా యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. వైద్యసేవలు, క్వారంటైన్ కేంద్రాల ఏర్పాటుపై మంత్రులు ఆళ్లనాని, బుగ్గన, గుమ్మనూరు జయరాం అధికారులతో సమీక్షించారు. వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నందికొట్కూరు, మల్యాలలో.... కరోనా కేసులు నమోదవడంతో రెడ్‌జోన్‌గా ప్రకటించి ఆయా ప్రాంతాల నుంచి ఎవరూ బయటకు రావొద్దని హెచ్చరించారు. రహదారులపై హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. గడివేముల మండలంలోని బిలకలగూడూరు నుంచి 3 కిలోమీటర్ల పరిధి మేర...ఎవరూ రాకుండా అధికారులు జాగ్రత్తలు చేపట్టారు. కడపలోని అలంపల్లె ప్రాంతాన్ని.. రెడ్‌జోన్‌గా ప్రకటించారు. చిత్తూరు జిల్లాలో పాజిటివ్ కేసులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఆరోగ్య పరిస్థితిపై ఇంటింటిసర్వేచేస్తున్నారు.
కృష్ణా జిల్లా
కృష్ణా జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు ఆందోళన కల్గిస్తున్నాయి. పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. నూజివీడులో కర్ఫ్యూ సడలించారు. 9 నుంచి 13 వార్డులు మినహా మిగిలిన ప్రాంతాల్లో నిత్యవసరాల కోసం ప్రజలను అనుమతించారు. గుంటూరు జిల్లాలోనూ పెరుగుతుండటంతో అధికారులు... అప్రమత్తమయ్యారు జిల్లావ్యాప్తంగా 332 మంది ఐసోలేషన్ లో ఉండగా 486 మంది క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్నారు.
గుంటూరు జిల్లా
గుంటూరు నగరంలో అత్యధిక కేసులు ఉండటంతో లాక్‌డౌన్ పకడ్బంధీగా అమలు చేస్తున్నారు. ఇంటింటి సర్వే ద్వారా అనుమానిత లక్షణాలున్నవారిని గుర్తించేందుకు జల్లెడ పడుతున్నారు. మంగళగిరిలో చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో వీధుల్లో హైపోక్లోరైట్ ద్రావణాన్ని చల్లారు.
నెల్లూరులో అప్రమత్తమైన అధికారులు
నెల్లూరుతోపాటు జిల్లాలోని కావలి, గూడూరు, సూళ్లూరుపేటను కంటోన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. నెల్లూరులో ఇటీవలే నూతన ఆస్పత్రి ప్రారంభించిన ఓ వైద్యుడికి పాజిటివ్ రావడంతో ఆ ఆస్పత్రి ప్రారంభోత్సవానికి వచ్చిన 40 మంది వైద్యులపై అధికారులు దృష్టిసారించారు. వారి బంధువుల్లో 80 మంది వరకు క్వారంటైన్‌కు తరలించారు.
ఉభయగోదావరి జిల్లాలు
ఉభయ గోదావరి జిల్లాల్లోనూ లాక్‌డౌన్ పకడ్బంధీగా అమలు చేస్తున్నారు. దిల్లీ మతప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారు, సన్నిహితంగా మెలిగిన వారిపై మరింత దృష్టిసారించారు. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలో పాజిటివ్‌గా నిర్థరణ అయిన వ్యక్తి నిర్వహించిన శుభకార్యక్రమంలో పాల్గొన్న ముగ్గురికి పాజిటివ్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. విశాఖలో ఇంటింటి సర్వే వేగంవంతం చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.విజయనగరం జిల్లా సాలూరు వీధుల్లో సోడియా హైపోక్లోరైట్ ద్రావణాన్ని చల్లారు.
ఇవీ చదవండి