పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని ఆశ్రం కొవిడ్ ఆస్పత్రిలో కరోనా బాధితుల ఆత్మహత్యలు ఆగడం లేదు. రెండు రోజుల వ్యవధిలో మరో ఇద్దరు ప్రాణాలు తీసుకున్నారు. స్నానాల గదిలో కత్తితో పొడుచుకుని ఓ వృద్ధుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వైరస్ సోకటంతో తీవ్ర మనోవేదనకు గురై అతను ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులకు ఆసుపత్రి సిబ్బంది తెలియజేశారు. మృతుడు బుట్టాయిగూడెం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.
మరోవైపు శనివారం ఉదయం మరో కొవిడ్ బాధితుడు ఆస్పత్రి పై అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. రెండు రోజుల్లో ఇద్దరు మృతి చెందటంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇతర రోగులు భయాందోళనకు గురవుతున్నారు. సిబ్బంది కొరత, పర్యవేక్షణ లేకపోవడం వంటి కారణాల వల్లే కొవిడ్ బాధితులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత నాలుగు నెలల కాలంలో నలుగురు వ్యక్తులు ఈ ఆసుపత్రిలో ఆత్మహత్య చేసుకున్నారు.
ఇదీ చూడండి.
ప్రజారోగ్యం దృష్ట్యా ఇప్పట్లో ఎన్నికలు పెట్టలేం : కొడాలి నాని