Alluri Family: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంత్యుత్సవాలకు తమను సాదరంగా ఆహ్వానించడాన్ని ఎన్నటికీ మరువలేమని.. అల్లూరి సీతారామరాజు వంశీయులు పేర్కొన్నారు. అల్లూరి కుటుంబ సభ్యులను ఒకే వేదికపైకి చేర్చడం, ప్రజలందరికీ తెలియజేయడం సంతోషకరమని వెల్లడించారు.
అల్లూరి వంశీయులమన్న విషయాన్ని తాము ఎప్పుడూ ఎక్కడా చెప్పలేదని, తమ పని తాము చేసుకుంటూనే ఇన్నాళ్లూ జీవనం సాగించామని తెలిపారు. అల్లూరి జయంత్యుత్సవాల్లో పాల్గొనేందుకు ఆయన వంశీయులు పశ్చిమగోదావరి జిల్లా భీమవరం చేరుకున్నారు. అల్లూరి అనుచరుల్లో ఒకరైన గంటం దొర వారసులైన బోడి దొర కుటుంబ సభ్యులూ వచ్చారు.
శ్రీరామరాజు పేర్లే.. మా కుటుంబంలో కొందరి పేర్లు శ్రీరామరాజు అనే ఉంటాయి. మా నాన్న సత్యనారాయణరాజు కంటే సీతారామరాజు పెద్దవారు. నాన్న వృద్ధాప్యంలోనూ తన అన్ననే తలచుకునేవారు.
ఏ ప్రాంతంలోనైనా అల్లూరి వేడుకలు జరుగుతుంటే వెళ్లేవారు. సీతారామరాజుకు తమ్ముడినని చెప్పేవారు కాదు. జనంలో ఉంటూ చూసి ఆనందించేవారు. భవిష్యత్తు తరాలకూ శ్రీరామరాజు అనే పేరే ఉండాలని కోరేవారు. - పత్సమట్ల సత్యవతి, అల్లూరి సోదరుడి కుమార్తె, కాకినాడ
అన్నతో ఉద్యమంలోకి వెళ్లి.. అల్లూరి సత్యనారాయణరాజు మా మావయ్య. ఆయనకు, సీతారామరాజుకు మధ్య సీతమ్మ అనే సోదరి ఉన్నారు. సీతారామరాజు మన్యంలో ఉన్నప్పుడు తానూ వెళ్లానని, కొద్దిరోజుల తర్వాత తిరిగొచ్చేశానని మా మావయ్య చెప్పేవారు.
తనకు తోడుగా ఉండాలన్న అమ్మ మాట కాదనలేక తిరిగొచ్చేశానని గుర్తు చేసుకునేవారు. అలాంటి కుటుంబానికి చెందిన మమ్మల్ని ఇక్కడికి తీసుకురావడం చూస్తుంటే ప్రపంచవ్యాప్తంగా సీతారామరాజుకు ఎంత గుర్తింపు ఉందో అర్థమవుతుంది.- అల్లూరి వెంకటలక్ష్మి, అల్లూరి సోదరుడి కోడలు, కాకినాడ
పార్లమెంటులో విగ్రహం పెట్టాలి.. మా కుటుంబం ఇప్పటివరకూ ఇలాంటి పెద్ద వేడుకకు హాజరు కాలేదు. మా పెదనాన్న అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని పార్లమెంటులో పెట్టాలన్నది మా అందరి కోరిక.
ఆయన నడయాడిన ప్రాంతాలకు సముచిత స్థానం కల్పించడాన్ని చూస్తుంటే ఆనందం కలుగుతుంది. మా కుటుంబం నుంచి ప్రధాని మోదీతో మాట్లాడే అవకాశం నాకు కల్పించడం మరింత సంతోషకరం. - అల్లూరి శ్రీరామరాజు, అల్లూరి సోదరుడి కుమారుడు, కాకినాడ
ప్రధానితో మాట్లాడే అవకాశం.. అల్లూరి సీతారామరాజుతో ఉన్న సత్సంబంధాలను తాత గంటం దొర చెప్పేవారు. ఈ ప్రాంతానికి మా తాత గతంలో వచ్చారు.
ప్రస్తుతం నన్ను ఆహ్వానించడం, ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడేందుకు వేదికపైకి ఆహ్వానించడం వంటివన్నీ అల్లూరి వల్లే దక్కాయని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. - బోడి దొర, గంటం దొర మనవడు, కృష్ణదేవిపేట, విశాఖపట్నం
ఇవీ చూడండి: